టోక్యో ఒలింపిక్ క్రీడలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. టోర్నమెంట్‌లో ప్రస్తుతం మొదటి వారం నడుస్తోంది. అనేక క్రీడలలో పతకాల పోటీలు జరిగాయి. ఇంకా చాలా వరకు జరుగుతున్నాయి. మరికొన్ని క్రీడల్లో లీగ్ పోటీలు జరుగుతున్నాయి. అయితే, తాజాగా ఒలింపిక్స్‌లో కొన్ని ఆటలలో మహిళా అథ్లెట్ల దుస్తుపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. బీచ్ వాలీబాల్, జిమ్నాస్టిక్స్ వంటి క్రీడలలో, మహిళా క్రీడాకారులు తరచుగా బికినీలు లేదా మోనోకినిలు ధరించే ఈ ఈవెంట్లలో పాల్గొంటారు. ఈ ఆటలలో మహిళా అథ్లెట్లను లైంగిక వస్తువులుగా చూపిస్తున్నారనే ఆరోపణలకు ఇవి దారితీసింది. పొట్టి దుస్తులు ధరించాలనే బలవంతం కారణంగా, ఆటగాళ్లు తరచుగా దోపిడీకి గురవుతున్నారు. అయితే ఇలాంటి పటీల్లో పురుషులుపూర్తిగా కప్పబడిన దుస్తులను ధరిస్తారు. ఇటీవల, జర్మన్ మహిళా జిమ్నాస్ట్‌లు ఫొట్టి దుస్తులకు బదులుగా పూర్తిగా కప్పి ఉంచే వాటినే ధరించాలని నిర్ణయించుకున్నారు. అలాగే నార్వే మహిళల బీచ్ వాలీబాల్ జట్టు కూడా బికినీకి బదులుగా షార్ట్స్ ధరించాలని నిర్ణయించింది. అయితే, ఇలాంటి నిర్ణయం వల్ల వారు జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది.