- Telugu News Photo Gallery Tirumala Ratha Saptami celebrations with surya prabha vahanam with lot of devotees
Tirupati: రథసప్తమి.. సూర్యప్రభ వాహనంపై దేవదేవుని కటాక్షం..పరవశించిపోయిన భక్తజనం..ఆ ఫోటోలు ఇవిగో..
తిరుమల క్షేత్రంలో సూర్య జయంతి వేడుక ముగిసింది. రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వస్తున్న టిటిడి ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేడుక జరిపింది. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామి 7 వాహన సేవలను అందుకున్నారు.
Raju M P R | Edited By: Jyothi Gadda
Updated on: Feb 05, 2025 | 1:07 PM

తిరుమల క్షేత్రంలో 1564 నుండి రథసప్తమి జరుగుతోంది. రథసప్తమి పర్వదినాన్ని శాసనాధారాలు ఉండగా సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేసి రథసప్తమి ని వేడుకగా నిర్వహిస్తున్నారు.

ఫిబ్రవరి 4 రథ సప్తమి సందర్భంగా తిరుమల స్వామివారికి ఉదయం తోమాల, కొలువు, సహస్రనామార్చన నిర్వహించారు. ఆ తర్వాత సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగి అనుగ్రహించారు. అర్ధ బ్రహ్మోత్సవంగా మినీ బ్రహ్మోత్సవం గా పరిగణించే ఒక రోజు బ్రహ్మోత్సవం విజయవంతంగా టీటీడీ నిర్వహించింది. గత 460 ఏళ్లుగా తిరుమలలో రథసప్తమి నిర్వహిస్తున్నారు.

సూర్యప్రభ వాహనంతోనే రథసప్తమి ప్రారంభం కాగా ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు వైభవంగా జరిగింది. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.48 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఎంతో ఆసక్తితో నిరీక్షించిన భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామి వారి వాహనసేవ వైభవంగా జరిగింది.

సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాతగా మొక్కులు చెల్లించారు. ఇక ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడనిఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభగా భావించే భక్తులు సూర్య మండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడేనని నమ్మకం.

సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్య నారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకంకాగా సూర్యప్రభ వాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం ఇచ్చారు.

రథసప్తమిలో మూడో వాహనమైన గరుడ వాహనసేవ వేడుకగా జరిగింది. సర్వపాప ప్రాయశ్చిత్తం గా గరుడ వాహనంపై శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తగా ఉదయం 11 నుండి 12 గంటల వరకు సాగింది. గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న వాహన సేవగా భావించే భక్తులు గరుడ వాహనంపై శ్రీవారిని దర్శించుకున్నారుజ్ఞానవైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయన్నది భక్త కోటి నమ్మకం.

రథసప్తమిలో నాలుగో వాహనమైన హనుమంత వాహనసేవ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు వాహనంపై భక్తులకు ఉభయ దీవేరులతో శ్రీవారు దర్శనం ఇచ్చారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు గా విశ్వసించే భక్తులు మొక్కులు చెల్లించారు.

టీటీడీ శ్రీ వేంకటేశ్వర బాలమందిరం లో చదువు కుంటున్న విద్యార్థులు ఆలపించిన ఆదిత్య హృదయం సూర్యాష్టకం, సంస్కృత శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం రాగా విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. కొన్నేళ్లుగా బాలమందిరం విద్యార్థులు శ్లోకాలు ఆలపిస్తున్నారు. సూర్యప్రభ వాహనసేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను అలరించాయి. సూర్యదేవుని వేశష ధారణలు, దశావతారాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కల్పవృక్ష వాహనంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యులు, టిటిడి అధికారుల ముందు టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు నుంచి సంతృప్తి వ్యక్తం అయింది. నాలుగు మాడ వీధుల్లో భక్తులు సౌకర్యార్థం టిటిడి అధికారులు, సిబ్బంది, పోలీసులు, జిల్లా యంత్రాంగం, శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారనీ చైర్మన్ బి ఆర్ నాయుడు హర్షం వ్యక్త చేశారు. గ్యాలరీలలోకి అన్న ప్రసాదాలు , తాగునీరు, పాలు, మజ్జిగ, బాదం పాలు, శెనగలు క్రమం తప్పకుండా అందించారన్న ఫీడ్ బ్యాక్ భక్తుల నుంచి అందింది.

లక్షలాది మంది భక్తుల మధ్య జరిగిన రథసప్తమి కన్నుల పండుగగా ముగిసింది. సూర్య జయంతి ని పురస్కరించుకొని తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహా లో తిరుమల క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ జరుగుతోంది

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి న సిబ్బంది ప్రశంసలు అందుకుంది. శ్రీవారి సేవకులు అవిశ్రాంతంగా సేవలు అందించారన్న అభిప్రాయాన్ని టిటిడి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో ముందు భక్తులు వ్యక్తం చేశారు.





























