
తిరుమలలో భక్తులకు తిలక ధారణ తిరిగి ప్రారంభమైంది. కరోనా సమయంలో తిలక ధారణ కు మంగళం పలికిన టీటీడీ మళ్ళీ అందుబాటులో తెచ్చింది. తిరుమలకు వచ్చే భక్తులకు తిలక ధారణను అప్పట్లో కొవిడ్ దూరం చేసింది. కోవిడ్ మహమ్మారి తగ్గు ముఖం పట్టినా తిలకధారణ విషయంపై టీటీడీ పెద్దగా పట్టించుకోలేదు. భక్తుల తిలకధారణ ఏర్పాట్లు చేయలేదు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో మాత్రం అందుబాటులో తిలకాన్నిపెట్టి టీటీడీ కంపల్సరీ చేయలేదు. అయితే ఇప్పుడు టీటీడీ గత నాలుగు సంవత్సరాలుగా నిలిచిపోయిన తిలక ధారణ కార్యక్రమాన్ని పునఃప్రారంభించింది.

తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చే ప్రతి భక్తుడు తిలకధారణ ధరించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వెంకన్న భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో శ్యామల రావు ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్ వద్ద ఈవోకు, భక్తులకు శ్రీవారి సేవకులు తిలక ధారణ చేశారు.

తిరుమలలో భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈఓ సంతోషం వ్యక్తం చేయగా శ్రీవారి సేవకులు తిలక ధారణ విధులు నిర్వహించనున్నారు.

తిరుమలలోని ఏటిసి, సుపథం, శ్రీ వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 ల వద్ద నిరంతరాయంగా భక్తులకు తిలక ధారణ చేయనున్నారు.

తిరుమలలో కనిపించే ప్రతి భక్తుడికి తిలక ధారణ చేసేలా శ్రీవారి సేవకులకు బాధ్యత అప్పజెప్పారు. ఇక తిలక ధారణ ప్రారంభ కార్యక్రమంలో ఈఓ తోపాటు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్ పాల్గొన్నారు.