- Telugu News Photo Gallery Spiritual photos Solar Eclipse on march 29, 2005: Check astrological effects on all zodiac signs
Solar Eclipse 2025: సూర్య గ్రహణంతో వారికి సరికొత్త జీవితం.. మీ రాశికి ఎలా ఉందంటే..?
సూర్య గ్రహణం 2025: మార్చి 29న సంభవించే పాక్షిక సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించనప్పటికీ దాని ఫలితాలు మాత్రం వివిధ రాశుల మీద కొద్దో గొప్పో పడే అవకాశం ఉంది. రవి, చంద్ర, రాహు గ్రహాల యుతి వల్ల ఏర్పడే ఈ పాక్షిక సూర్య గ్రహణం మీన రాశిలో సంభవిస్తోంది. దీని ప్రభావం పదిహేను రోజుల పాటు ఉంటుంది. సూర్య గ్రహణ సమయంలోనే మీన రాశిలో శని ప్రవేశించడం, శుక్ర, బుధ, రాహువుల కూడా అదే రాశిలో కలిసి ఉండడం వల్ల ఈ గ్రహణానికి సంబంధించిన దుష్ఫలితాలు బాగా తగ్గి ఉండే అవకాశం ఉంది. వివిధ రాశుల మీద ఈ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండేదీ ఇక్కడ పరిశీలిద్దాం.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Mar 28, 2025 | 4:50 PM

మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో గ్రహణంతో పాటు మరో మూడు గ్రహాలు కూడా యుతి చెందడం వల్ల ఆదాయం కంటే అనుకోని ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శారీరక, మానసిక ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్యలకు అనారోగ్య సమస్యలు కూడా తోడయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కడా భారీగా పెట్టుబడులు పెట్టవద్దు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో గ్రహణం చోటు చేసుకుంటున్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు కొద్ది పనిభారం, పని ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. మిత్రుల వల్ల కొద్దిగా ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. ఆదాయం కొద్దిగా తగ్గుతుంది.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో పురోగతికి అవరోధాలు కలుగుతాయి. ఎంత కష్టపడ్డా అధికారులకు తృప్తి ఉండని పరిస్థితి కూడా ఉంటుంది. సామాజిక సంబంధాలు కూడా ఇబ్బందుల్లో పడతాయి. కెరీర్ పరంగా పెద్దగా మార్పులు చేపట్టక పోవడం మంచిది. నిరుద్యోగులకు కొద్దిగా ఆశాభంగాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆదాయం మాత్రం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో గ్రహణం పడుతున్నందువల్ల అనేక ఆదాయ వృద్ధి, ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభ వార్తలు వింటారు. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

సింహం: అష్టమ స్థానంలో గ్రహణం సంభవించడం, అందులోనూ రాశ్యధిపతికి గ్రహణం పట్టడం వల్ల ఇతరులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కలుగుతుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల, మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలను తాత్కాలికంగా విరమించడం మంచిది. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందకపోవచ్చు.

కన్య: సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల వ్యక్తిగత సంబంధాలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు, అవివాహితులకు నిరాశా నిస్పృహలు ఎదురవుతాయి. ఏ పనీ, ఏ ప్రయత్నమూ ఒక పట్టాన సఫలం అయ్యే అవకాశం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలను పూర్తి చేయడం కష్టసాధ్యమవుతుంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఒత్తిడి కలిగిస్తాయి. ఆదాయ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయానికి లోటుండదు కానీ ఖర్చులు పెరుగుతాయి.

తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో గ్రహణం చోటు చేసుకుంటున్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెంది కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆదాయపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించకపోవచ్చు. చేపట్టిన ప్రయత్నాల్లో కొన్ని మాత్రమే నెరవేరుతాయి. కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రయాణాలు నష్టం కలిగిస్తాయి.

వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో పొరపాట్లు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాలు మందకొడిగా ముందుకు వెడతాయి. ప్రతి విషయంలోనూ రాజీపడడం, సర్దుకుపోవడం జరుగుతుంది. పిల్లల నుంచి సమస్యలు ఎదురవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఆశాభంగం కలిగిస్తాయి. ఒకటి రెండు దుర్వార్తలు వినాల్సి వస్తుంది. నిరుద్యోగులు మరి కొంత కాలం ఆగాల్సి ఉంటుంది. ఆదాయం కొద్దిగా మాత్రమే పెరుగుతుంది.

ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో గ్రహణం పట్టడం వల్ల సుఖ సంతోషాలు కొద్దిగా తగ్గుతాయి. కుటుంబ సమస్యల వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు మంద కొడిగా ముందుకు సాగుతాయి. దేనిలోనూ భారీగా పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, సంతృప్తినివ్వదు.

మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో సూర్య గ్రహణం సంభవిస్తున్నందువల్ల ఆదాయ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రతి ప్రయత్నమూ వ్యయ ప్రయాసలతో కూడుకొని ఉంటుంది. ప్రతి పనిలోనూ అసంతృప్తి ఉంటుంది. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అభద్రతా భావం కలుగుతుంది. కష్టార్జితానికి లోటుండదు కానీ, ఆర్థిక సమస్యల్లో మాత్రం మార్పు ఉండదు. కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి.

కుంభం: ధన స్థానంలో చోటు చేసుకుంటున్న ఈ గ్రహణం వల్ల ఈ రాశివారికి కొన్ని అదృష్టాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు కూడా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాలకు, ఉద్యోగం మారడానికి అనేక కొత్త అవకాశాలు అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.

మీనం: ఈ రాశిలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల జీవనశైలిలో కొద్దిగా మార్పు చోటు చేసుకుంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి, అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది కానీ, ఆర్థిక సమస్యలు మాత్రం కాస్తంత ఇబ్బంది పెడతాయి. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ లోపభూయిష్ఠంగా కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు గుర్తింపు లభించడంతో పాటు, కొద్దిపాటి పురోగతి కూడా ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి.





























