- Telugu News Photo Gallery Spiritual photos Significance of kalyana venkateswaraswami temple in srinivasa mangapuram
Kalyana Venkateswara Swamy: జాతకదోషంతో పెళ్లికాని ప్రసాదులు ఈ స్వామివారికి కళ్యాణం జరిపించి కంకణం ధరిస్తే.. వెంటనే వివాహం
ఆధునిక యుగంలో ఉరుకులపరుగుల జీవితం.. ఇక విధినిర్వహణలో పడిన నేటి యువత పెళ్లి ఊసెత్తడం లేదు. మూడు పదుల దాటినా జీతానికి జీవితం ముడిపెట్టి.. వివాహాన్ని వాయిదావేస్తూ వస్తున్నారు. ఇక జాతకాలు కుదరడంలేదని జాతక బలం తక్కువగా ఉందని పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. ఏ కారణమైతేనేమి.. చాలామంది పెళ్లి కాని ప్రసాదులుగానే మిగిలిపోతున్నారు. అటువంటివారు శ్రీనివాస మంగాపురం ఆలయ దర్శనం చేసుకుంటే పెళ్లి ఘడియలు వస్తాయని పూర్వకాలం నుంచి వస్తున్న నమ్మకం
Updated on: Apr 02, 2021 | 1:46 PM

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై క్షేత్రం తిరుమల. భక్తుల పాలిటి కొంగు బంగారంగా ప్రపంచ ఖ్యాతిగాంచింది. అయితే తిరుమలలో శ్రీవారి ఆలయంతో పాటు.. శ్రీనివాసమంగాపురం ఆలయం కూడా అంతే ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రీవారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తున్నారు.

ఆలయ స్థలపురాణం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతిని నారాయణవనంలో పరిణయం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతుడై తిరుమల కొండకు బయలుదేరగా.. శాస్త్ర ప్రకారం పెళ్లయిన దంపతులు ఆరు నెలల వరకు కొండ ఎక్కకూడదని పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళకూడదని అగస్త్య మహర్షి చెప్పారట.దీంతో స్వామివారు దేవేరితో కలిసి అగస్త్య ఆశ్రమంలోనే ఆరునెలలపాటు విడిది చేశారట. ఆరునెలల తర్వాత తిరుమల కొండకు పయనమైన స్వామివారు భక్తులకు రెండు వరాలను ప్రసరించారని పురాణాల కథనం.

ఏడుకొండలు ఎక్కి తిరుమలకు చేరుకోలేని భక్తులు..శ్రీనివాస మంగాపురంను దర్శించుకోవచ్చునని చెప్పారట.. అంతేకాదు.. ఈ పుణ్యక్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి సకల సౌఖ్యాలు, పెళ్లి కాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని వరంగా తిరుమలేశుడు ఇచ్చాడని పురాణాల ద్వారా తెలుస్తోంది.

శ్రీనివాస మంగాపురంలోని ఆలయాన్ని 16వ శతాబ్ద కాలంలోనే నిర్మించినట్లుగా అక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. అప్పటి నుండి ఇప్పటి వరకూ వివాహం లేటు అయ్యిన వారు ముఖ్యంగా జాతకదోషంతో పెళ్ళి ఆలస్యం అయినవారు దోష నివారణ కోసం ఇక్కడ పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు. దోష పరిహారార్ధం తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని శ్రీనివాస మంగాపురం ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం జరిపిస్తూనే ఉన్నారు.

స్వామివారికి పద్మావతికి కళ్యాణం చేసిన తర్వాత యువతీ యువకులకు అర్చకులు ఓ కంకణం ధరింపజేస్తారు. అలా కంకణం ధరించిన యువకులకు వెంటనే వివాహం జరుగుతుందని అక్కడి పండితులు చెబుతున్నారు. రోజు రోజుకి మంగాపురంలో స్వామివారి కళ్యాణం జరిపిస్తున్న వారికి వివాహలు జరగడంతో విశ్వాసం కూడా పెరుగుతూ వస్తుంది. కల్యాణ శ్రీనివాసుడు గా ఖ్యాతిగాంచారు.




