
వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న శని వక్రగతిని వదిలిపెట్టినందువల్ల ఈ రాశివారికి ఇక అనేక విధాలుగా లాభాలు చేకూర్చే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయాన్ని వృద్ధి చేయడంతో పాటు, ఉద్యోగంలో పదోన్నతి, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెంపు, విదేశీ అవకాశాలు వంటి అంశాల్లో ఈ రాశివారికి తప్పకుండా విజయాలు లభించే అవకాశం ఉంది. వీరు ఏ ప్రయత్నం తలపెట్టినా శని వీరిని అనుగ్రహిస్తాడు.

కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న శని వల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశీయాన యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడంతో పాటు, విదేశీ సంపాదన అను భవించే యోగం కూడా పడుతుంది. కొద్ది ప్రయత్నంతో ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆపర్లు కూడా అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆదాయం వృద్ధి చెంది సగటు వ్యక్తి సైతం సంపన్నుడవుతాడు.

తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో ఉన్న శని వక్ర త్యాగం చేసి, రుజు మార్గం పట్టడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడం, మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరడంతో పాటు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు.

వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు వక్ర త్యాగం చేసి పూర్ణ శుభుడుగా మారినందువల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభిస్తాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది.

మకరం: రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో పురోగతి చెందుతున్నందువల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.