
మేషం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉండడం ఒక విశేషం కాగా, భాగ్య స్థానాన్ని వీక్షిస్తున్నందువల్ల అనేక విధాలుగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. అనేక మార్గాల్లో సంపద వృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.

వృషభం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన శనీశ్వరుడు లాభ స్థానంలో మరో రెండేళ్లు ఉండబోతున్నందువల్ల ఈ రాశివారికి అనేక పర్యాయాలు అదృష్టాలు కలిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల తప్పకుండా అపార ధన లాభం కలుగుతుంది. సంతాన యోగం పడుగుంది. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశికి భాగ్యస్థానమైన కుంభ రాశి మీద గురువు దృష్టి పడడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బ డిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు, సంపద లభిస్తాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఏడాది పాటు సుఖ సంతోషాలతో జీవితం సాగిపోతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.

సింహం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి కుజుడు ఈ రాశిలోనే సంచారం చేస్తున్నందువల్ల ఆగస్టు నెలాఖరు వరకు ఈ రాశివారి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వాపారాలు అభివృద్ధి బాటపడతాయి. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై భూలాభం కలుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల మరో ఏడాది పాటు ఈ రాశివారికి ఏ లోటూ లేకుండా జీవితం సాగిపోతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జీతభత్యాలు, రాబడి బాగా పెరుగుతుంది. ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.

మకరం: భాగ్య స్థానం మీద రాశ్యధిపతి శని దృష్టి పడడం, భాగ్యాధిపతి బుధుడు సప్తమంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి విషయాల్లో విదేశీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించడంతో పాటు రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది.