
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో ఫిబ్రవరి 6 నుంచి బుధ, శుక్రుల కలయిక జరగడం వల్ల ఇష్ట కార్య సిద్ధి యోగం కలుగుతోంది. దీని వల్ల ఈ రాశివారికి ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందే అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది.

వృషభం: రాశినాథుడైన శుక్రుడు దశమ స్థానంలో బుధుడితో కలవడం వల్ల ఈ రాశివారికి ఈ ఇష్ట కార్య సిద్ధి యోగం పూర్తి స్థాయిలో పట్టే అవకాశం ఉంది. దీనివల్ల మనసులోని కోరికలు, ఆశలు కొన్ని అప్రయత్నంగానూ, ప్రయత్నపూర్వకంగానూ నెరవేరడం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి తప్పకుండా లాభాలు కురిపిస్తాయి. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది.

మిథునం: రాశ్యధిపతి బుధుడు నవమ స్థానంలో శుక్రుడితో కలవడం వల్ల విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు చేయడానికి అవకాశం కలుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది. వ్యాపారాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది.

తుల: రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడితో కలవడం వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. వైవాహిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.

మకరం: ఈ రాశికి ధన స్థానంలో బుధ, శుక్రుల కలయిక వల్ల ఇష్ట కార్యసిద్ధి యోగం కలిగింది. కుటుంబ జీవితం నల్లేరు మీద బండిలా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

కుంభం: ఈ రాశిలో బుధ, శుక్రుల కలయిక వల్ల పూర్తి స్థాయిలో ఇష్ట కార్య సిద్ధి యోగం కలుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు, ఆశలు నెరవేరుతాయి. కుటుం బంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.