
గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతున్న సమయంలో మనిషి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం తెలివితేటలు, వాక్చాతుర్యం , వ్యాపారాలకు సంబంధించిన గ్రహం అయిన బుధుడు ఈ రోజు (జూలై 18, 2025) కర్కాటక రాశిలో తిరోగమనంలోకి వెళ్తాడు. బుధుని ఈ తిరోగమన కదలిక ఆగస్టు 1, 2025 వరకు ఉంటుంది. ఒక గ్రహం తిరోగమనంలో ఉన్నప్పుడు.. దాని శక్తి భూమిపై వేరే విధంగా అనుసంధానించబడుతుందని నమ్ముతారు. కర్కాటక రాశిలో బుధుడు తిరోగమనంలో ఉండటం కొన్ని రాశులకు అదృష్టాన్ని కలిగిస్తుందట. ఈ సమయంలో అదృష్టాన్ని సొంతం చేసుకునే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

గ్రహం తిరోగమన అంటే ఏమిటి? ఒక గ్రహం తిరోగమనంలో ఉన్నప్పుడు.. భూమి నుంచి చూసేటప్పుడు దాని సాధారణ చలనానికి విరుద్ధంగా వెనుకకు కదులుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇది కేవలం ఒక ఆప్టికల్ భ్రమ. జ్యోతిషశాస్త్రంలో తిరోగమన గ్రహాలు ఆ గ్రహానికి సంబంధించిన రంగాలలో కొంత విరామం, పునఃమూల్యాంకనం లేదా ఊహించని ఫలితాలను తీసుకురాగలవు. బుధుడు తిరోగమనంలో కమ్యూనికేషన్, ప్రయాణం, సాంకేతిక విషయాలలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. అయితే ఇది స్వీయ నిర్వహణ, పాత సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా ఒక గొప్ప అవకాశం. బుధుడు తిరోగమనంలో ఉండటం వల్ల ఈ 4 రాశుల వారికీ అదృష్టం సొంతం

మేషరాశి జ్యోతిషశాస్త్రం ప్రకారం మేష రాశి వారికి బుధుడు తిరోగమనం వల్ల ఇల్లు , కుటుంబానికి సంబంధించిన విషయాలలో శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరు తమ మూలాలతో కనెక్ట్ అయ్యే అవకాశం లభిస్తుంది. పాత ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కరించబడతాయి లేదా పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలను పొందవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం ఉంటుంది. కెరీర్‌లో అకస్మాత్తుగా అవకాశం రావచ్చు, ఇది వీరి ఆర్థిక స్థితిని బలపరుస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశిలోనే బుధుడు తిరోగమనంలో ఉన్నందున ఇది మీకు స్వీయ-ప్రతిబింబం, వ్యక్తిత్వ వికాసానికి సమయం అవుతుంది. అయితే ప్రారంభంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత గందరగోళం లేదా ఇబ్బందిని అనుభవించవచ్చు. అయితే ఈ సమయం ప్రాధాన్యతలను తిరిగి నిర్వచించుకోవడానికి సహాయపడుతుంది. వీరిలో ఉన్న ప్రతిభను గుర్తించి, వాటిని మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తమ లక్ష్యాలను సాధించడానికి మరింత దృఢ నిశ్చయంతో ఉంటారు. ఆర్థికంగా, ఆకస్మిక ద్రవ్య లాభాల అవకాశాలు ఉన్నాయి.

వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి బుధుడు ఈ తిరోగమన కదలిక అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయం ఉన్నత విద్య రంగంలో శుభప్రదంగా నిరూపించబడుతుంది. ఈ రాశికి చెందిన స్టూడెంట్స్ విదేశీ పర్యటన లేదా ఉన్నత చదువులు చదవాలని ప్లాన్ చేస్తుంటే... ఈ కాలంలో వీరు ఊహించని విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మికతవైపు అడుగులు వేస్తారు. జీవితంలోని లోతైన రహస్యాలను అర్థం చేసుకోవడానికి అనుగుణంగా ఆలోచనలు సాగుతాయి. ముఖ్యంగా ఊహకు అందని ప్రాంతాల నుంచి ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలు పెట్టి.. పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు.

మీన రాశి మీన రాశి వారికి కర్కాటకంలో బుధుడు తిరోగమనం చెందడం ప్రేమ సంబంధాలు, పిల్లలు, సృజనాత్మకత రంగంలో ప్రయోజనకరంగా ఉంటుంది. వీరి ప్రేమ మరింత మధురంగా మారుతుంది. ఏదైనా అపార్థం ఉంటే, అది పరిష్కరించబడుతుంది. అవివాహితులకు కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అందుకోవచ్చు. కళ, సంగీతం లేదా ఏదైనా సృజనాత్మక రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని పొందుతారు. గుర్తింపు కూడా లభిస్తుంది. ముఖ్యంగా వీరు తమ అభిరుచులు లేదా సృజనాత్మక పని నుంచి ఆర్థిక లాభాలను పొందేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి.