
సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష దైవం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దక్షిణాయనంలో సంచరించే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే శుభదినం మకర సంక్రాంతి. ఈ పండగ పుష్య మాసంలో వస్తుంది. పుష్యం అంటే పోషణ శక్తి గలది అని అర్ధం. కనుక ఈ రోజున స్నానం, దానం, పూజ కు విశిష్ట స్థానం ఉంది.

ధర్మ స్థాపన కోసం సంక్రాంతి రోజునే శ్రీ మహా విష్ణువు అసురులను మంధర పర్వతం కింద పూడ్చాడని పురాణం కథనం. ఈ రోజున నువ్వుల నూనె రాసుకుని నలుగు పెట్టుకుని అభ్యంగ స్నానం చేయడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. శాస్త్రీయ కోణం నుంచి చూస్తే నువ్వుల నూనెతో స్నానం, నువ్వులను తినడం వంటివి శరీరానికి మంచి చేస్తాయి. బలవర్ధకమైన ఆహారం.

ఎవరి జతకంలోనైనా శని దోషం ఉంటె ఈ రోజు నువ్వులను దానం ఇవ్వడం వలన శనీశ్వరుడు శాంతిస్తాడని నమ్మకం. అంతేకాదు ఈ రోజున ఎవరైతే స్నానం చేయరో వారు ఏడు జన్మలు వ్యాధులతో బాధపడతారని.. పేదరికంతో జీవిస్తారని స్కాంద పురాణం పేర్కొంది.

మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం వల్ల పండుగలన్నంటిలోనూ ఇది విశిష్టమైనది. ఉత్తరాయణం దేవతలకు ఇష్టమైన కాలం

ఈ సమయంలో పూజ, పునష్కారాలు, యజ్ఞయా గాదులు చేసి దేవతలను మెప్పించాలి. అలా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని పూర్వీకుల నమ్మకం.

పురాణాల ప్రకారం ఈ రోజు స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని నమ్మకం. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగలు అవ్వడమే ప్రధాన కారణం.

ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణ ఇస్తారు. . ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా.. ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. అంతేకాదు గోవును దానం చేస్తే విశిష్ట ఫలితం కలుగుతుందని నమ్మకం.