పూజా విధానం, నియమాలు:
లక్ష్మీ పంచమి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి, ఇల్లంతా శుభ్రం చేసుకుని, తలస్నానం ఆచరించాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, బియ్యప్పిండితో అందమైన ముగ్గులు వేయాలి. ఇలా ఇంటి గుమ్మాన్ని అలంకరించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని విశ్వాసం. పూజ కోసం లక్ష్మీదేవి చిత్రపటం, రాగి కలశం, అక్షింతలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ వంటి వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ రోజున కొత్తగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని కొని తెచ్చుకోవడం శుభప్రదం. పూజ గదిలో ఒక చెక్క పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి, లక్ష్మీదేవి ఫోటోని ఉంచి, గులాబీ పూలతో అలంకరించాలి. రాగి లేదా ఇత్తడి కలశంలో నీళ్లు పోసి, పసుపు కుంకుమలు వేసి, పైన కొబ్బరికాయను ఉంచాలి. ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాత "ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ ఆవు నెయ్యితో వెలిగించిన రెండు దీపాల సమక్షంలో లక్ష్మీదేవికి అక్షింతలు, పుష్పాలు సమర్పించాలి. నైవేద్యంగా పాలు పొంగించి చేసిన పరమాన్నం నివేదించడం వల్ల కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి.