
మేషం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన గురువు వచ్చే ఏడాది మే నెల వరకు తన సొంత నక్షత్రం లోనూ, ఆ తర్వాత ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా భూమి పూజలు, గృహ ప్రవేశాలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. తప్పకుండా గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరడానికి, వైభవంగా పెళ్లి జరగడానికి అవకాశం ఉంది. సంతాన ప్రాప్తికి కూడా అవకాశముంది.

మిథునం: వచ్చే ఏడాది మే నెల వరకు ఈ రాశిలో సంచారం చేస్తున్న గురువు వచ్చే ఏడాది జూన్ నుంచి కుటుంబ స్థానంలో ఉచ్ఛ పడుతున్నందువల్ల కుటుంబంలో తప్పకుండా శుభ కార్యాలు, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఏడాది ప్రారంభంలో సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. సంతాన యోగం కలగడానికి బాగా అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

కర్కాటకం: వచ్చే ఏడాది జూన్ నుంచి ఈ రాశివారి కుటుంబంలో ఏదో ఒక శుభ కార్యం జరుగుతూనే ఉంటుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలతో పాటు ఆదాయ వృద్ది ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. గృహ ప్రవేశం చేస్తారు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. చదువుల్లో ఘన విజయాలు, ఉద్యోగ ప్రాప్తి, ఆకస్మిక ధన లాభం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

కన్య: ఈ రాశికి ప్రస్తుతం దశమ స్థానంలో సొంత నక్షత్రంలో ఉన్న గురువు వచ్చే ఏడాది మే వరకూ ఉద్యోగపరంగా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లోనూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జూన్ నుంచి గురువు లాభ స్థానంలో ఉచ్ఛ పడుతున్నందు వల్ల భూమి పూజలు, గృహ ప్రవేశాలు, వివాహ మహోత్సవాలు వంటి శుభ కార్యాలు తప్పకుండా జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం నిశ్చయం అవుతుంది.

వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలోకి గురువు ప్రవేశించి ఉచ్ఛపడుతున్నందువల్ల వచ్చే ఏడాది జూన్ నుంచి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడి, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు మెరుగుపడడంతో పాటు, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. గృహ, వాహన లాభాలు కూడా కలుగుతాయి. అనేక విధాలుగా కుటుంబంలో సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది.

మకరం: వచ్చే ఏడాది జూన్ నెల ప్రారంభంలో గురువు సప్తమ స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉండబోతున్నందు వల్ల ఈ రాశివారి స్థితిగతులు కూడా ఉచ్ఛ దశలో ఉండే అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. సత్కారాలు, సన్మానాలు జరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందడం వల్ల కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. కల్యాణ మహోత్సవాలతో పాటు గృహ ప్రవేశాలు, స్థలాల రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతాయి. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి.