
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర, బుధులు కలవడం వల్ల సంపద వృద్ది జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు చాలావరకు తగ్గిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

మిథునం: రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో మిత్రగ్రహమైన శుక్రుడితో యుతి చెందడం వల్ల షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అదనపు ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అంద లాలు ఎక్కుతారు. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఆస్తి ఒప్పందాలు కుదురుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

కర్కాటకం: ఈ రాశిలో శుక్ర, బుధుల కలయిక వల్ల ధన ధాన్య సమృద్ధి యోగం పూర్తి ఫలితాలనిస్తుంది. దేనికీ కొరత ఉండదు. ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు, ఆస్తి వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కోలుకుంటారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు, వ్యాపారాల్లో లాభాల వృద్ధికి అవకాశం ఉంది.

కన్య: రాశ్యధిపతి బుధుడు తన మిత్ర గ్రహమైన శుక్రుడిని లాభ స్థానంలో కలుసుకోవడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడంతో పాటు ఆకస్మిక దన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించిన లాభాలకు కలుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము, బాకీలు, బకాయిలను వసూలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది.

తుల: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు భాగ్యాధిపతి బుధుడితో కలవడం వల్ల ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. కొద్ది ప్రయత్నంతో ఆదాయం అంచనాలను మించి సంపన్నుడి స్థాయికి చేరుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో బుధ, శుక్రుల కలయిక వల్ల ధన ధాన్య సమృద్ధి యోగంతో పాటు, ధర్మకర్మాధిపయోగం కూడా కలుగుతుంది. దీనివల్ల ధన యోగాలతో పాటు రాజయోగాలు కూడా కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఆర్థికంగా కూడా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి.