
M.S.స్వామినాథన్.. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు మనకొంబు సాంబశివన్ స్వామినాథన్.

అధిక దిగుబడి ఇచ్చే వరి, గోధుమ వంగడాలు సృష్టించి భారతదేశంలోని రైతుల ఆదాయాన్ని పెంచడంలో గణనీయమైన కృషి చేసిన శాస్త్రవేత్త స్వామినాథన్.

అన్నమో రామచంద్ర అని ఉన్న భారతదేశాన్ని అన్నపూర్ణగా మార్చిన దార్శనికుడు స్వామినాథన్. ఆహారధాన్యాలపరంగా భారత్ నేడు స్వయంసమృద్ధిగా నిలబడిందంటే దానికి కారణం స్వామినాథన్ ముందుచూపు, ఆయన చేసిన పరిశోధనలే కారణం.

డాక్టరు కావాలనుకున్న స్వామినాథన్, 1943లో వచ్చిన బెంగాల్ దుర్భిక్షం చూసి చలించిపోయి వ్యవసాయ రంగానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో వ్యవసాయ శాస్త్రవేత్తగా మారారు. పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత IPSకు సెలక్ట్ అయినా వ్యవసాయ రంగంపై ఆసక్తితో అటువైపే మొగ్గుచూపారు.

1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. 1961లోనే ఆయన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకున్నారు.

1969లో భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. 1971లో ప్రతిష్ఠాత్మక రామన్ మెగసేసే అవార్డు అందుకున్నారు. 1987లో వల్డ్ ఫుడ్ ప్రైజ్ అందుకున్న తొలి శాస్త్రవేత్త స్వామినాథన్.