ముందుగా ఒక మిక్సీ జార్ లో రెండు కప్పుల ఉడికించిన అన్నం, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. నీళ్లు కలపకుండా, ఈ మిశ్రమాన్ని మెత్తగా, పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న అన్నం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేయండి. పెరుగు వల్ల పిండి కాస్త పల్చగా అనిపిస్తే, మరొక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, మరొక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ కలిపి పిండిని గట్టిగా చేసుకోవచ్చు. అయితే, మరీ ఎక్కువ పిండి లేదా రవ్వ కలిపితే వడలు గట్టిగా వస్తాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో అర టీ స్పూన్ జీలకర్ర, పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లి తరుగు, రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం తరుగు, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర వేయండి. పిల్లలు పచ్చిమిర్చి, అల్లం ముక్కలను ఇష్టపడకపోతే, వాటిని కచ్చాపచ్చాగా దంచి వేయవచ్చు.