
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా పద్ధతిగా పెంచాలి అనుకుంటారు. అంతే కాకుండా పిల్లల పెంపకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి ప్రతీది నేర్పిస్తుంటారు. ఇక ప్రతి పేరెంట్ తమ పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం చేస్తుంటారు. తమకు తామే స్వయంగా డబ్బును దేనికి ఖర్చుపెట్టుకోవడం, అవసరాలు తీర్చుకోడంపై అవగాహన కల్పిస్తారు. మరి ఇలా తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇవ్వడం సరైనదో, కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. దీని వలన పిల్లలు తమ డబ్బుతో వస్తువులు కొనేటప్పుడు డబ్బు విలువ తెలుసుకుంటారు. డబ్బు ఖర్చు చేసేముందు ఆలోచిస్తుంటారు. ఇది వారిని అనవసర ఖర్చుల నుంచి కాపాడుతుంది. భవిష్యత్తులో వారిని ఆర్థికంగా బాధ్యతాయుతంగా చేస్తుందంట.

ఇలా పాకెట్ మనీ ఇవ్వడం వలన పిల్లలు ప్రతి చిన్న చిన్న అవసరాలకు పదే పదే తల్లిదండ్రులపై ఆధారపడాల్సి ఉండదంట. దీని వలన వీరికి డబ్బుపై సరైన అవగాహన వస్తుంది. అలాగే, ఇది వారు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా డబ్బు సంపాదించడం అంత సులువు కాదు, మనీని జాగ్రత్తగా దాచుకోవాలనే విషయం తెలుస్తుంది.

అలాగే తక్కువ డబ్బులతో తమ అవసరాలను ఎలా తీర్చుకోవాలో అన్న విషయాన్ని పాకెట్ మనీ పిల్లలకు నేర్పుతుంది. ఇది బాల్యం నుండే ప్రణాళిక, బడ్జెట్ వేసే అలవాటును పెంపొందించడానికి వారికి సహాయపడుతుంది. డబ్బు విషయంలో వారు చాలా జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది.

పాకెట్ మనీ వలన పిల్లలు డబ్బును ఎలా సేవ్ చేసుకోవాలో నేర్చుకుంటారు. చాలా మంది పిల్లలు పాకెట్ మనీ నుండి పొదుపు చేయడం నేర్చుకుంటారు. వారు ఏదైనా పెద్ద వస్తువు కొనడానికి పొదుపు చేసినప్పుడు, వారు డబ్బు విలువను బాగా గ్రహిస్తారు.ఇది వీరికి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది.