
అలర్ట్.. వాయుగుండం దూసుకువస్తోంది.. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. పేర్కొంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది.

ఆగ్నేయ బంగాళాఖాతం.. అండమాన్ నికోబార్ దీవులను ఆనుకుని అల్పపీడనం కేంద్రీకృతం అయిందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఇది వాయువ్య దిశగా పయనించి గురువారం ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

శుక్రవారం నాటికి ఇది ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

దక్షిణ కోస్తాలోని నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయతీ.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు.

బుధవారం ఏపీ వ్యాప్తంగా చాలాచోట్లా మోస్తారు వర్షాలు కురుస్తాయని అన్నారు. అల్పపీడనం బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి వచ్చాక ఏపీపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని సునంద చెప్పారు.