IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా వన్డేల్లో పరుగుల వీరులు వీరే.. టాప్ 5 లిస్టులో ధోనితో సహా నలుగురు మనోళ్లే..
IND vs AUS ODI: ప్రపంచ కప్ 2023 టోర్నీ ప్రారంభానికి ముందు భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. నేడు తొలి వన్డే జరగనుండగా.. సెప్టెంబర్ 24న రెండో వన్డే, సెప్టెంబర్ 27న మూడో వన్డే జరగనుంది. అయితే మెగా టోర్నీకి ముందు జరిగే ఈ సిరీస్‌లో పరుగుల వర్షం కురిపించి, వరల్డ్‌కప్ వేదికగా తలపడే ప్రత్యర్థులకు హెచ్చరిక జారీ చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. 43 సంవత్సరాలుగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లెవరో తెలుసా..? టాప్ 5 లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఇప్పడు చూద్దాం..
Updated on: Sep 22, 2023 | 10:43 AM

IND vs AUS ODI: వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు 146 ‘భారత్ vs ఆస్ట్రేలియా’ మ్యాచ్‌లు జరగ్గా.. వాటిల్లో టీమిండియా 54, ఆసీస్ 82 గెలిచాయి. మరో 10 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇలా 43 సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వంద సెంచరీల వీరుడు సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.

‘భారత్ vs ఆస్ట్రేలియా’ వన్డేల్లో ఆసీస్‌పై 71 మ్యాచ్‌లు ఆడిన సచిన్ 44.59 యావరేజ్, 84.71 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 3077 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 15 అర్థ సెంచరీలు కూడా ఉండడం గమనార్హం.

సచిన్ తర్వాత ‘భారత్ vs ఆస్ట్రేలియా’ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ కంగారులతో 42 మ్యాచ్‌లు ఆడి 8 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో మొత్తం 2251 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ తన తొలి డబుల్ సెంచరీ(209)ని ఆస్ట్రేలియాపైనే చేయడం గమనార్హం. ఇక ఆసీస్‌పై రోహిత్ యావరేజ్ 59.23, స్ట్రైక్‌రేట్ 94.42 గా గణాంకాలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. ఆస్ట్రేలియాపై వన్డే డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు రోహిత్.

ఫార్మాట్ ఏదైనా ఆస్ట్రేలియాపై విరుచుకుపడే విరాట్ కోహ్లీ లేకుండా ఈ లిస్టు పూర్తి కాదు కదా..! ‘భారత్ vs ఆస్ట్రేలియా’ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఆసీస్‌పై 46 మ్యాచ్‌లు ఆడి 52.97 యావరేజ్, 95.34 స్ట్రైక్‌రేట్, 8 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో మొత్తం 2172 పరుగులు చేశాడు.

‘భారత్ vs ఆస్ట్రేలియా’ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో ఒకే ఒక్క ఆసీస్ ఆటగాడు రిక్కీ పాంటింగ్. పాంటింగ్ భారత్‌పై 59 మ్యాచ్‌లు ఆడి 40.07 యావరేజ్, 81.41 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 2164 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పాంటింగ్ 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ లిస్టు 5వ స్థానంలో ఉన్నాడు. ధోని కంగారుల జట్టుపై 55 మ్యాచ్‌ల్లో 1660 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ధోని యావరేజ్ 44.86, స్ట్రైక్‌రేట్ 80.89గా ఉండగా.. అతని పేరిట 2 సెంచరీుల, 11 హాష్ సెంచరీలు ఉన్నాయి.





























