
ఈ ఐపీఎల్ సీజన్ మధ్యలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ సుమారు 10 కిలోల బరువు పెరిగాడని, దాని వల్ల ఆయన క్రీజులో చురుగ్గా కదలలేకపోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలం కావడంతో ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో ఆయన తన అసాధారణ క్లాస్ ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బరువు పెరిగారన్న వారికి తన పరుగుల వేగంతోనే గట్టి జవాబు ఇచ్చాడు.

ధర్మశాల స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 32 బంతుల్లోనే 57 పరుగులు సాధించి ముంబై బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 బౌండరీలు (6 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. 178.12 స్ట్రైక్ రేటుతో సాగిన ఈ మెరుపు ఇన్నింగ్స్ ప్రస్తుత సీజన్‌లో ఆయనకు ఐదవ అర్ధ సెంచరీ కావడం విశేషం. స్టాండ్స్‌లో కూర్చున్న పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా, ప్రభ్‌సిమ్రాన్ షాట్లకు ముగ్ధురాలై నిలబడి చప్పట్లతో అభినందించాడు.

ప్రభ్‌సిమ్రాన్ ఈ భారీ ఇన్నింగ్స్ ఆడటంలో అదృష్టం కూడా కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌లో ఆయనకు రెండుసార్లు లైఫ్ లభించింది. వ్యక్తిగత స్కోరు 5 పరుగుల వద్ద ఉన్నప్పుడు నమన్ ధీర్ క్యాచ్ జారవిడచగా, 28 పరుగుల వద్ద కార్బిన్ బాష్ మరో క్యాచ్ వదిలేశాడు. ఈ అవకాశాలను చక్కగా వినియోగించుకున్న ప్రభ్‌సిమ్రాన్, పంజాబ్ జట్టుకు బలమైన పునాది వేశాడు.

ఈ ఇన్నింగ్స్‌తో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లలో 43.90 సగటుతో 439 పరుగులు సాధించాడు. ముఖ్యంగా 170.15 స్ట్రైక్ రేటుతో పరుగులు రాబడుతూ జట్టుకు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు.

కీలక సమయంలో ప్రభ్‌సిమ్రాన్ ఫామ్‌లోకి రావడం పంజాబ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతే విజయం వరిస్తుందని ఆయన నిరూపించాడు.