- Telugu News Photo Gallery Cricket photos Ipl 2027 trade updates hardik pandya suryakumar yadav rishabh pant transfers
1, 2 కాదు ఏకంగా 9 ట్రేడ్‌లు.. ఐపీఎల్ 2027నే మార్చనున్న తొమ్మిది మంది ప్లేయర్లు.. లిస్ట్ చూస్తే పరేషానే?
IPL 2027 Player Transfers: ఐపీఎల్ 2027 ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఈ ముందస్తు ట్రేడింగ్ వార్తలు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. స్టార్ ఆటగాళ్లు జట్లు మారితే, రాబోయే సీజన్ లో జట్ల బలాబలాలు పూర్తిగా మారిపోవడం ఖాయం. మరి ఈ 9 మంది ఆటగాళ్లలో ఎంతమంది నిజంగానే జట్లు మారుతారో చూడాలి.
Updated on: Jun 10, 2026 | 11:58 AM

IPL 2027 Trade Updates: ఐపీఎల్ ముగిసినా ఆ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచిన ఆనందంలో అభిమానులు ఉంటే, అప్పుడే ఐపీఎల్ 2027 సీజన్ కోసం తెరవెనుక భారీ వ్యూహాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి మే 30 వరకు జరగబోయే 20వ మైలురాయి సీజన్ కోసం ఏకంగా తొమ్మిది మంది స్టార్ ఆటగాళ్లు జట్లు మారబోతున్నట్లు బలమైన వార్తలు వినిపిస్తున్నాయి.

ముంబై ఇండియన్స్‌కు షాక్.. హార్దిక్, సూర్య అవుట్..?: గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టును నడిపించిన హార్దిక్ పాండ్యా, వచ్చే సీజన్‌లో ఆ జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ లేదా పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా పాత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కోల్‌కతా మేనేజ్‌మెంట్ సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది. ఇదే జరిగితే ముంబై జట్టుకు ఇది కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి.

లక్నోకు పంత్ గుడ్ బై.. నికోలస్ పూరన్ ముంబైలోకి?: గత వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఏకంగా రూ. 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన రిషబ్ పంత్, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలం కావడంతో పంత్ మళ్లీ తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ లేదా కోల్‌కతా నైట్ రైడర్స్ వైపు చూస్తున్నాడు. లక్నో నుంచి మరో స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ కూడా ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సొంత గూటికి శ్రేయస్ అయ్యర్.. లక్నో వైపు అక్షర్ పటేల్..: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి తన సొంత రాష్ట్ర జట్టు ముంబై ఇండియన్స్‌లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ముంబై లోకల్ ప్లేయర్ కావడంతో అతని ట్రేడింగ్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ గత సీజన్ లో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో, అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.

మహమ్మద్ షమీ, అర్జున్ టెండూల్కర్ జట్లు కూడా చేతులు మారనున్నాయా?: లక్నో జట్టుకు ఆడిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని తమ జట్టులోకి తెచ్చుకోవడానికి ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇక సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ సైతం వచ్చే సీజన్ లో మరో జట్టుకు మారే అవకాశం ఉందని సమాచారం. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన ఆల్‌రౌండర్ రమణ్‌దీప్ సింగ్ కూడా వచ్చే ఏడాది ముంబై ఇండియన్స్ జెర్సీలో కనిపించే అవకాశం ఉంది.
