- Telugu News Photo Gallery Cricket photos IND vs NZ Team India All Rounder Ravindra Jadeja became 5th highest wicket taker of India
IND vs NZ: ముంబైలో చెలరేగిన ధోని దోస్త్.. కట్‌చేస్తే.. ఆ దిగ్గజాల సరసన చోటు
Ravindra Jadeja: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా.. టీమిండియా ముగ్గురు దిగ్గజ బౌలర్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా జడేజా నిలిచాడు.
Updated on: Nov 01, 2024 | 7:51 PM

IND vs NZ, Ravindra Jadeja: వాంఖడే మైదానంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను 235 పరుగులకు ముగించింది. కివీస్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టగలిగాడు.

రవీంద్ర జడేజా ఖాతాలో పడిన వికెట్లలో విల్ యంగ్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ ఉన్నారు. తొలి రోజు ఆటలో తొలి రెండు సెషన్లలో మూడు వికెట్లు తీసిన జడేజా, టీ విరామానికి ముందు గ్లెన్ ఫిలిప్స్ వికెట్ తీశాడు. దీంతో జడేజా అద్వితీయ రికార్డు సృష్టించాడు.

గ్లెన్ ఫిలిప్స్ వికెట్‌తో, రవీంద్ర జడేజా ఇప్పుడు భారత్ తరపున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. దీంతో జడేజా, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలను కూడా అధిగమించాడు.

రవీంద్ర జడేజా ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో 312 వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలను అధిగమించాడు. క్రికెట్‌లో సుదీర్ఘమైన ఫార్మాట్‌లో జహీర్, ఇషాంత్ చెరో 311 వికెట్లు తీశారు.

అలాగే వాంఖడే మైదానంలో ఏకంగా 5 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా.. భారత్‌లో ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కపిల్ దేవ్‌ను అధిగమించాడు. భారత్‌లో కపిల్ 11 సార్లు ఐదు వికెట్లు తీయగా, జడేజా 12 సార్లు ఐదు వికెట్లు తీశాడు.





























