- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS: 5 Records Virat Kohli Could Break In WTC Final 2023
IND vs AUS: కింగ్ కోహ్లీ కోసం ఎదురుచూస్తున్న 5 రికార్డులు.. ద్రావిడ్, సచిన్, ధోని, వివ్ రిచర్డ్స్‌ని అధిగమించి..
WTC Final 2023- Virat Kohli: ఓవల్ మైదానంలో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫలితంగా తొలి బ్యాటింగ్ చేస్తున్న కంగారుల జట్టు క్రీజులో క్రమంగా నిలదొక్కుకుంది. అయితే ఆసీస్ జట్టును ఆలౌట్ చేసే దిశగా టీమిండియా వెళ్తుంటే.. కోహ్లీ కోసం 5 రికార్డులు ఎదురువస్తున్నాయి.
Updated on: Jun 07, 2023 | 8:43 PM

ఆస్ట్రేలియాతో 24 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 42 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు సహా 48.26 సగటుతో మొత్తం 1979 పరుగులు చేశాడు. ఇక ఇటీవల కంగారులతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాల్గో టెస్టులో అయితే ఏకంగా 186 పరుగులతో చెలరేగాడు. ఈ క్రమంలోనే డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్‌లోనూ కోహ్లీ చెలరేగితే.. అతని ఖాతాలో ఏకంగా 5 రికార్డులు చేరతాయి. అవేమిటంటే..

విరాట్ కోహ్లి ప్రస్తుతం 16 ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లు ఆడగా 15 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో అతను ఆరు అర్ధసెంచరీలతో సహా మొత్తం 620 పరుగులు చేశాడు. అంటే.. సచిన్ టెండూల్కర్ (14 ఇన్నింగ్స్‌ల్లో 657 పరుగులు), రికీ పాంటింగ్ (18 ఇన్నింగ్స్‌ల్లో 731 పరుగులు)లను అధిగమించి నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించేందుకు కోహ్లీకి ఇంకా 38 పరుగులు మాత్రమే కావాలి.

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 5 ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లు ఆడాడు. భారత్ తరఫున అత్యధిక ICC ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ల జాబితాలో యువరాజ్ సింగ్(7) అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న డబ్య్లూటీసీ ఫైనల్‌లో ఆడడం ద్వారా.. ఇప్పటివరకు 5 ఐసీసీ ఫైనల్స్ ఆడిన ఎంఎస్ ధోనిని అధిగమించాడు. విరాట్‌తో పాటు రోహిత్ కూడా తన కెరీర్‌లో 6వ ఐసీసీ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాడు.

ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్‌పై 511 పరుగులు చేయడం ద్వారా టెస్టు క్రికెట్‌లో ఒక బౌలర్‌పై అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. లియాన్‌పై 570 పరుగులతో చతేశ్వర్ పుజారా అగ్రస్థానంలో ఉండగా, కుమార సంగక్కర (సయీద్ అజ్మల్‌పై 531 పరుగులు), స్టీవ్ స్మిత్ (స్టువర్ట్ బ్రాడ్‌పై 520 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పుజారా తన ఆధిక్యాన్ని పెంచుకునే అవకాశం ఉండగా, సంగక్కర, స్మిత్‌లను ఛేజింగ్ చేసే అవకాశం కోహ్లీకి ఉంది.

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంగ్లాండ్ మైదానాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మ్యాన్. ఇంగ్లాండ్‌లో 46 మ్యాచ్‌లు ఆడిన ద్రావిడ్ 55 సగటుతో 2,645 పరుగులు చేశాడు. అలాగే 43 మ్యాచ్‌ల్లో 2,626 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ద్రవిడ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. అయితే ఇంగ్లాండ్‌లో 56 మ్యాచ్‌ల్లో 2,574 పరుగులతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. అంటే ద్రావిడ్, టెండూల్కర్‌లను ఒకేసారి అధిగమించడానికి కోహ్లీకి ఇంకా 72 పరుగులు అవసరం.

టెస్టు క్రికెట్‌లో 950 బౌండరీలకు చేరువలో ఉన్న కోహ్లీ ప్రస్తుతం రెడ్ బాల్ క్రికెట్‌లో 941 బౌండరీలు బాదాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 9 బౌండరీలు బాదితే.. వీవీఎన్ రిచర్డ్స్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కెవిన్ పీటర్సన్ జాబితాలో చేరుతాడు. టెస్టు క్రికెట్‌లో 2058 బౌండరీలతో సచిన్ టెండూల్కర్ అత్యధిక బౌండరీలు కొట్టిన ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్నాడు.




