- Telugu News Photo Gallery Cricket photos Gautam Gambhir Makes explosive one MS Dhoni's Winning Sixer at 2011 World Cup Final
Gautam Gambhir: ‘ధోనీ ఒక్కడి వల్లే ప్రపంచకప్ రాలేదు’.. మహీ సిక్సర్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు..
Gautham Gambhir: గత పదేళ్లలో అంటే 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేదు. ఈ క్రమంలో ఎలా అయినా అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరిగే 2023 వన్డే ప్రపంచకప్ టైటిల్ గెలుచుకోవాలని రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా పట్టుదలగా ఉంది. అయితే చివరిసారిగా భారత్ 2011 వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ముంబై వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2011 ఫైనల్‌లో శ్రీలంకపై విజయం సాధించిన భారత్ ప్రపంచ విజేతగా నిలిచింది. అయితే ఆ వరల్డ్ కప్ నేపథ్యంలో విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రెడిట్ గురించి మాట్లాడుతూ ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ ఏమన్నాడంటే..?
Updated on: Aug 25, 2023 | 6:41 AM

1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ తొలిసారిగా ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ 28 ఏళ్ల తర్వాత 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్ విజేతగా నిలిచింది.

2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్-శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇక ఆ మ్యాచ్‌లో విన్నింగ్ సిక్సర్‌తో క్రికెట్ అభిమానుల్లో ముద్ర వేసుకున్న టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ధోని ఆ మ్యాచ్‌లో అజేయంగా 91 పరుగులు చేశాడు.

అదే మ్యాచ్‌లో ధోని కంటే ముందు క్రీజులోకి వచ్చిన గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేశాడు. అలాగే టోర్నీ ఆసాంతం మెరుగ్గా రాణించిన యువరాజ్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. అయితే అభిమానులు మాత్రం ఇప్పటికీ ధోని విన్నింగ్ సిక్సర్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, ‘ఏ ఒక ఆటగాడూ టోర్నీని గెలవలేడు. అలా జరిగి ఉంటే, భారతదేశం అన్ని ప్రపంచకప్‌లను గెలుచుకునేది. నేను 97 పరుగులు చేయడం గురించి మాట్లాడకండి. కానీ యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, సురేష్ రైనా, మునాఫ్ పటేల్ కూడా బాగా రాణించారు’

‘సచిన్ టెండూల్కర్ కూడా ఆ ప్రపంచకప్‌లో 2 సెంచరీలు సాధించాడు. దాని గురించి ఎంత మందికి తెలుసు. ఇప్పటికీ ఆ ఒక్క సిక్సర్ గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం మీడియా, సోషల్ మీడియా మాత్రమే’ అంటూ గంభీర్ ఘాటుగా చెప్పుకొచ్చాడు.





























