
ఈ సినిమా నాది అని రంగంలోకి దిగాక.. ఎంత దూరమైనా వెళ్తున్నారు మన హీరోలు. దర్శకుడు చూసుకుంటాడు.. నిర్మాత చూసుకుంటాడులే అనుకోవట్లేదు. ప్రొడక్షన్‌లోనూ దూరిపోతున్నారు.. అన్నీ తామేయై ముందుండి నడిపిస్తున్నారు. తాజాగా యశ్ కూడా ఇదే చేస్తున్నారు. మరి టాక్సిక్ కోసం ఆయనేం చేస్తున్నారో తెలుసా..?

కేజియఫ్‌తో యశ్ మార్కెట్ మారిపోయింది. చాలా మంది అగ్ర దర్శకులు తన కోసం కథలు సిద్ధం చేసినా.. ఆయన మాత్రం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చెప్పిన కథపై నమ్మకంతో టాక్సిక్ చేస్తున్నారు.

KVN ప్రొడక్షన్స్ ఈ సినిమాను దాదాపు 300 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో కరీనా కపూర్, కియారా అద్వానీ అంటూ స్టార్ క్యాస్ట్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. టాక్సిక్‌లో నటుడిగానే కాదు.. నిర్మాతగానూ బిజినెస్ బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటున్నారు యశ్.

ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్‌లో ఒకేసారి షూట్ చేస్తున్న మొదటి ఇండియన్ సినిమా ఇదే. దీనికోసం హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 20th సెంచరీ ఫాక్స్‌తోనూ టై అప్ అవుతున్నారు టాక్సిక్ టీం.

టాక్సిక్ మాత్రమే కాదు.. రామాయణ్ సినిమాకూ ఇదే చేస్తున్నారు యశ్. ఇందులో రావణుడిగా నటిస్తూనే.. కథ నచ్చి నిర్మాణంలో భాగమయ్యారు. సినిమాకు ఏమేం కావాలో దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. మొత్తానికి ఇటు టాక్సిక్.. అటు రామాయణ్ సినిమాలతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోవాలని చూస్తున్నారు రాకింగ్ స్టార్.