ఈ వారం రెండే సినిమాలు వచ్చాయి. ఈ రెండింటిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే హీరోల సంగతి ఎలా ఉన్నా.. ఈ రెండు సినిమాల దర్శకులకు మాత్రం లిట్మస్ టెస్ట్ తప్పదు. ఒకరేమో కొత్త.. ఇంకొకరు డెబ్యూ మూవీతో డిజాస్టర్ ఇచ్చి రేసులో వెనకబడిన దర్శకుడు. మరి ఈ ఇద్దరిలో విజయం ఎవర్ని వరించబోతుంది..? గెలుపు ఎవరి తలుపు తట్టబోతుంది..?
భగవంత్ కేసరి తర్వాత మళ్లీ భారీ సినిమాలేవీ విడుదల కాలేదు. ఒకట్రెండు మీడియం రేంజ్ సినిమాలు వచ్చినా కనీసం ప్రభావం కూడా చూపించలేదు. దాంతో మొన్నొచ్చిన యానిమల్‌కే మన ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వారం 2 సినిమాలువచ్చాయి. ఒకటి నాని హాయ్ నాన్న అయితే.. మరోటి నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ రెండింటిపై అంచనాలు బాగానే ఉన్నాయి.
ఇటు హాయ్ నాన్న.. అటు ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ రెండూ ఆయా దర్శకులకు అగ్నిపరీక్ష పెడుతున్నాయి. దానికి కారణం కూడా చాలా సింపుల్.. నాని సినిమాతో శౌర్యు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డెబ్యూ డైరెక్టర్ కాబట్టి ఆ ఒత్తిడి ఎలాగూ ఉంటుంది.
ఇక వక్కంతం వంశీ పరిస్థితి వేరు. ఆరేళ్ళ కింద ఈయన నా పేరు సూర్యతో దర్శకుడిగా పరిచయమయ్యారు.. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. రైటర్‌గా బ్లాక్‌బస్టర్స్ అందుకున్న వక్కంతం.. దర్శకుడిగా మాత్రం సత్తా చూపించలేకపోయారు. దాంతో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ వక్కంతం కెరీర్‌కు కీలకంగా మారింది.