
కనీసం విశాల్ నటించిన ఏ సినిమాలో ఏ చిన్న క్యారెక్టర్ కూడా చేయలేదు ధన్సిక. అయినా కూడా ఈ ఇద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు.. తాజాగా ఎంగేజ్మెంట్ కూడా అయింది. తమిళ ఇండస్ట్రీలో అజిత్ శాలిని, సూర్య జ్యోతిక, నయనతార విగ్నేష్.. ఇలా చాలా ప్రేమ జంటలున్నాయి.

కానీ వాళ్లందరూ సినిమాలతోనే పరిచయం. కానీ విశాల్, ధన్సిక మాత్రం సినిమాటిక్ స్టైల్లో కలిశారు. ఆమె కష్టాల్లో ఉన్నపుడు ఓదార్చి ప్రేమలో పడేసాడు విశాల్. మనుషులు కలిసి నటించకపోయినా వీళ్ళ మనసులు మాత్రం కలిశాయి. ఈ ఇద్దరి ప్రేమకు బీజం పడింది మాత్రం 8 ఏళ్ల కింద.

అప్పట్లో జరిగిన ఒక సంఘటన కారణంగా విశాల్, సాయి ధన్సిక మధ్య ప్రేమ పుట్టింది. శింబు వాళ్ళ నాన్న రాజేందర్ కారణంగానే విశాల్ ప్రేమలో పడ్డాడు. కృష్ణ, విధర్త్, సాయి ధన్సిక కలిసి 2017లో విజితిరు అనే సినిమాలో నటించారు. ఆ సినిమాలో టీ రాజేందర్ ఒక కీలక పాత్రలో నటించాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో సాయి ధన్సిక మాట్లాడుతూ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పి రాజేందర్‌ను మాత్రం మరిచిపోయింది.. దాంతో ఆమె మీద చాలా కోప్పడ్డాడు రాజేందర్. సీనియర్లను గౌరవించడం తెలియదా అంటూ చడామడా తిట్టేసాడు.

అది ఆమె అనుకోకుండానే చేసిన.. దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేసాడు రాజేందర్. రజనీ సినిమాలో నటించాక ఆమెకు పొగరు బాగా పెరిగిపోయిందంటూ రెచ్చిపోయాడు. సారీ చెప్పినా పట్టించుకోలేదు. స్టేజీపై ఈ అవమానం తర్వాత సాయి ధన్సికను ఏ ఒక్కరూ ఓదార్చలేదు.. అప్పుడొచ్చాడు సినిమాటిక్ స్టైల్‌లో విశాల్. విషయం తెలుసుకున్న అప్పటి తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ మాత్రం రాజేందర్‌పై భగ్గుమన్నాడు.

తనకంటే చిన్నవాళ్ళను ఆశీర్వదించడం మానేసి ఇష్టమొచ్చినట్లు తిట్టడం ఏంటి అంటూ సీరియస్ అయ్యాడు. అప్పటికే సాయి ధన్సిక, విశాల్ మధ్య పరిచయం ఉన్నా.. రాజేందర్ ఎపిసోడ్ తర్వాత ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నా బయటికి రానివ్వలేదు ఈ జోడీ. ఇప్పుడు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు.