
పరిస్థితులు చూస్తుంటే ఇంకొన్నాళ్లు త్రివిక్రమ్‌కు ఎదురు చూపులు తప్పేలా లేవు. కోరుకున్న హీరో దొరకాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. అందుకే ఈ లోపు తన పాత పాత్రలోకి వెళ్లడానికి గురూజీ నిర్ణయించుకున్నారేమో అనిపిస్తుంది. దర్శకుడిగా మారాక వదిలేసిన డ్యూటీనే మళ్లీ ఇప్పుడు చేయబోతున్నారీయన. ఈ గ్యాప్‌లో మాటల మాంత్రికుడు ఏం చేయబోతున్నారో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..

గుంటూరు కారంకు ముందు త్రివిక్రమ్‌కు దర్శకుడిగా లాంగ్ గ్యాప్ వచ్చింది. 2020లో అల వైకుంఠపురములో వస్తే.. నాలుగేళ్ళ తర్వాత కానీ గుంటూరు కారం రిలీజ్ కాలేదు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే త్రివిక్రమ్‌కి మళ్లీ భారీ గ్యాప్ తప్పేలా లేదు. అల్లు అర్జున్ సినిమా కమిటైనా.. అదెప్పుడు సెట్స్‌పైకి వస్తుందనేది ఇప్పట్లో క్లారిటీ రావడం కష్టమే.

దర్శకుడిగా మారిన తర్వాత.. రైటర్‌గా ఆపేసారు త్రివిక్రమ్. మధ్యలో స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం తీన్‌మార్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలకు మాటలు రాసారు. ఇతర హీరోలు, దర్శకులు అడిగినా కూడా మెట్టు దిగలేదు గురూజీ. కానీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు త్రివిక్రమ్‌లోని రైటర్ మళ్లీ నిద్ర లేస్తున్నారు. ఇతర హీరోల కోసం కథలు రాయడానికి రెడీ అవుతున్నారు మాటల మాంత్రికుడు.

త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో కలిసి ఫార్చున్ ఫోర్ బ్యానర్‌లో ఆయన సతీమణి సౌజన్య వరస సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక సితారలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రాబోయే ఓ సినిమాకు మాటసాయం చేయబోతున్నారు త్రివిక్రమ్. వెంకీ అట్లూరీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది.

త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లేతో సిద్ధూ ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. 20 ఏళ్ళ కిందే రైటర్‌గా భారీ పారితోషికం అందుకున్న త్రివిక్రమ్.. ఇప్పుడు ఎంత తీసుకుంటారనేది ఊహించడం కష్టమే. ఏదేమైనా దర్శకుడిగా వచ్చిన గ్యాప్‌ను తనలోని రైటర్‌తో భర్తీ చేయాలని చూస్తున్నారు గురూజీ. చివరగా నితిన్ ఛల్ మోహన్ రంగాకు కథ అందించారు త్రివిక్రమ్.