
బంగారం లాంటి సమ్మర్ సీజన్‌ను క్యాష్ చేసుకోడానికి మన హీరోలెందుకో గానీ ముందుకు రావట్లేదు. నాని ఇప్పటికే హిట్ 3తో రచ్చ చేస్తున్నారు.. మే 30న కింగ్డమ్ అంటూ విజయ్ దేవరకొండ వచ్చేస్తున్నారు.

ఇప్పటికైతే ఈ రెండే సమ్మర్‌లో రానున్న క్రేజీ సినిమాలు..! మిగిలిన వాళ్లంతా జూన్, జులై, ఆగస్ట్ అంటూ వెళ్లిపోతున్నారు. అందులో స్టార్సే ఎక్కువగా ఉన్నారు. పీక్ సమ్మర్ అంతా అరకొర సినిమాలతోనే వెళ్లిపోతుంది.

మే 1న నాని వచ్చారు.. మే 9న సింగిల్ అంటూ శ్రీ విష్ణు.. శుభంతో సమంత వస్తున్నారు. అంతే.. వీళ్ళ తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ సినిమా అంటే జూన్ 20న రాబోతున్న కుబేరానే. ఈ గ్యాప్‌లో తెలుగు సినిమాలేవీ రావట్లేదు. జూన్ 5న థగ్ లైఫ్ వస్తున్నా.. అది డబ్బింగ్ సినిమా.

జూన్ 20న కుబేరా వస్తుంటే.. 27న కన్నప్ప రానుంది. ఇక జులై 4న నితిన్ తమ్ముడు డేట్ లాక్ చేసుకుంది. చాలా రోజులుగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌పై చర్చ జరుగుతూనే ఉంది. మొత్తానికి ఈ సినిమా ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. చిత్రయూనిట్ అంతా కలిపి డైరెక్టర్ వేణు శ్రీరామ్ బర్త్ డే సందర్భంగా సరదా వీడియో ఒకటి విడుదల చేసారు.

ఇవన్నీ సమ్మర్ తర్వాత రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాలు. కానీ ఇంకా విడుదల తేదీ ఖరారు కాని సినిమాలు కూడా ఉన్నాయి. పవన్ హరిహర వీరమల్లు, చిరంజీవి విశ్వంభర ఎప్పుడొస్తాయో తెలియదు. మొత్తానికి హాట్ సమ్మర్‌కు దూరంగా ఉన్నారు మన స్టార్ హీరోలు. మరి వేసవి తర్వాతైనా బాక్సాఫీస్‌ను మోత మోగిస్తారేమో చూడాలిక.