ఏ ఫిల్మ్ బై శేఖర్ కమ్ముల.. ఈ లైన్ చూడగానే సినిమా ఇలా ఉంటుందనే అంచనా వచ్చేస్తుంది. కానీ ఆ అంచనాలకు అందకుండా ఓ సినిమా చేయాలనుకుంటున్నారీయన. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ధనుష్ సినిమా కోసం తనను తాను పూర్తిగా మార్చుకుంటున్నారు. అలవాటు లేని పనులన్నీ ఒకేసారి చేస్తున్నారు. ఇంతకీ అంతగా శేఖర్ కమ్ముల ఏం చేస్తున్నారు..?
అవును.. నిజంగానే శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమా విషయంలో ఏదో జరుగుతుంది. మునుపెన్నడూ లేని మార్పును చూపించాలనుకుంటున్నారు ఈ దర్శకుడు. తొలిసారి ఫుల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ధనుష్, రష్మిక ఈ సినిమాలో జంటగా నటిస్తుంటే.. నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది.
లవ్ స్టోరీ తర్వాత మూడేళ్లకు పైగా టైమ్ తీసుకుని ఈ కథ రాసుకున్నారు శేఖర్ కమ్ముల. ధనుష్, నాగార్జునలతో దీన్ని పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు కమ్ముల.
ఈ సినిమాకు ధారావి టైటిల్ పరిశీలిస్తున్నారు. ధారావి ముంబైలోని ప్రధానమైన మురికివాడ. ఈ ఏరియాకు మాఫియాను లింక్ చేస్తూ శేఖర్ కమ్ముల ఈ సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది.
శేఖర్ కమ్ముల అంటే క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినా.. అప్పుడప్పుడూ అనామిక, లీడర్ లాంటి డిఫెరెంట్ సినిమాలు చేసారు. ఇప్పుడు కూడా ధనుష్, నాగ్ మల్టీస్టారర్‌తో తొలిసారి ఫుల్ లెంత్ మాఫియా సినిమాను తన స్టైల్‌లో తెరకెక్కిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరి శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న ఫస్ట్ యాక్షన్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.