
బిజినెస్ లెక్కలు మాట్లాడుకోవాల్సి వస్తే... ఆంధ్రా, సీడెడ్, నైజామ్ అంటారు. ప్రాంతాల వారీగానూ అంతే. ఒకప్పుడు ఫ్యాక్షనిజం చూపించాలన్నా, కత్తి పట్టినా కర్నూలు కొండారెడ్డి బురుజుకు వెళ్లేవి సినిమాలు. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా, మళ్లీ ట్రెండ్ మొదలైంది.

బలే యాపీ ఉంటదిగదిరా నీకూ... అంటూ అల్లు అర్జున్ రాయలసీమ యాసలో మాట్లాడుతుంటే థియేటర్లలో మోత మామూలుగా లేదు. ఇది గదా మచ్చా మేం కోరుకున్యది అంటూ ఖుషీ అయిపోయారు యువత.

వేర్ ఈజ్ పుష్ప అంటూ వెతికిన వారికి... జాతర్లో ఉన్నాలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన జవాబు ఇంకా ఖుషీ చేస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు ఎప్పుడెప్పుడు వస్తుందా? అసలు తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ స్క్రీన్ల మీద ఎంత హంగామా చేస్తాడా? అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్

పులెందల పూలంగళ్ల కాన్నుంచి, కడప కోట్‌రెడ్డి సర్కిల్ దాంకా... అంటూ రాయలసీమ యాసలో తారక్ చెప్పిన అరవింద సమేత డైలాగులకు ఫ్యాన్స్ ఈలలు గోలలు మస్తుగా వినిపించాయి.

సీరియస్ సన్నివేశాల్లోనే కాదు, పూజాహెగ్డేతో మాట్లాడే సరదా సన్నివేశాల్లోనూ తారక్ మాటలకు ఫిదా కాని వారు లేరు. తారక్ నోట సీమ యాస వినాలని థియేటర్లకు రిపీటెడ్‌గా వెళ్లారు ఆడియన్స్

సరిగ్గా పట్టుకోవాలే గానీ, కోట్లు గుమ్మరిస్తున్న రాయలసీమ యాస మీద ఫోకస్ పెంచుతున్నారట రవితేజ. గోపీచంద్ మలినేని డైరక్షన్‌లో ఆయన నటించే లేటెస్ట్ సినిమా కోసం సీమ శ్లాంగ్ నేర్చుకుంటున్నారట.

ఆంధ్రా, తెలంగాణ మాటలతో మాస్‌ని అలరించిన మహరాజ్ త్వరలోనే సీడెడ్‌లోనూ స్టామినా చూపించడానికి రెడీ అవుతున్నారు. యంగ్ హీరో సుధీర్‌బాబు కూడా చిత్తూరు శ్లాంగ్‌తో ఓ సినిమా చేస్తున్నారు.