
నేషనల్ మార్కెట్‌కు గేట్లు ఓపెన్ చేసింది తెలుగు హీరోలే. బాహుబలి తరువాత తెలుగు సినిమాలు అన్ని భాషల్లోనూ భారీ వసూళ్లు సాధిస్తుంటే ఇతర భాషల స్టార్స్ ఆ రేంజ్‌ను అందుకోవడానికి తంటాలు పడ్డారు.

లియో రిలీజ్ తరువాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా నెక్ట్స్ మూవీతో బిజీ అయ్యారు విజయ్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు.లోకేష్ కూడా లియో ప్రమోషన్స్ లో పాల్గొంటూనే నెక్ట్స్ మూవీ పనులు కానిచ్చేస్తున్నారు.

ఇన్నాళ్లు విజయ్ మార్కెట్ మీద టాలీవుడ్‌లో ఉన్న అనుమానాలకు లియోతో చెక్ పడింది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. ఫస్ట్ వీకెండ్‌కే బ్రేక్ ఈవెన్ అవ్వటంతో టాలీవుడ్‌లో విజయ్‌కి సాలిడ్ మార్కెట్ క్రియేట్ అయినట్టైంది.

ఆల్రెడీ తెలుగులో మంచి బిజినెస్ చేసే సత్తా ఉన్న రజనీకాంత్ రీసెంట్ టైమ్స్‌లో తన ఫామ్ కోల్పోయారు. జైలర్‌కు ముందు రజనీ చేసిన చాలా సినిమాలు తెలుగుతో పాటు తమిళ మార్కెట్‌లోనూ నిరాశపరిచాయి. కానీ జైలర్ రిలీజ్ తరువాత లెక్కలు మారిపోయాయి.

ఈ సినిమా ఏకంగా 500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వటంతో మరోసారి తలైవా రేంజ్ ఏంటో ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా తెలుగు మార్కెట్‌లోనూ భారీ వసూళ్లు సాధించటంతో రజనీకి టాలీవుడ్‌లోనూ పూర్వ వైభవం వచ్చిందంటున్నారు మార్కెట్ ఎనలిస్ట్‌లు.

ఇక తెలుగు మార్కెట్‌లో మరోసారి తన పట్టు చూపించిన కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్. చాలా ఏళ్లుగా ఒక్క హిట్ అంటూ ఎదురుచూసిన లోకనాయకుడు విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈ సినిమాతో కోలీవుడ్‌లోనే కాదు పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ సాధించి సత్తా చాటారు.

విక్రమ్ సినిమా తెలుగులో భారీ వసూళ్లు సాధించి మరోసారి తెలుగులో లోకనాయకుడి మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసింది. తమిళ హీరోలు మాత్రమే కాదు కన్నడ, మలయాళ హీరోలు కూడా తెలుగులో మార్కెట్ క్యాప్చర్ చేసేందుకు కష్టపడుతున్నారు.

ఇప్పటికే మాలీవుడ్ నుంచి సీనియర్లు మమ్ముట్టి, మోహన్‌లాల్‌తో పాటు ఫాహద్ ఫాజిల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్స్ తెలుగు మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. కన్నడ నుంచి కూడా యష్, రిషబ్ శెట్టి, శివ రాజ్‌కుమార్ లాంటి స్టార్స్ తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు.

ఒకప్పుడు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న బాలీవుడ్ కూడా ఇప్పుడు టాలీవుడ్ వెంట పరిగెడుతోంది. ఆల్రెడీ సల్మాన్, షారూఖ్ లాంటి స్టార్స్ టాలీవుడ్‌తో మింగిల్ అయ్యే పనిలో ఉన్నారు. రణబీర్, రణవీర్, షాహిద్, కార్తిక్ ఆర్యన్ లాంటి యంగ్ జనరేషన్ హీరోలు కూడా టాలీవుడ్‌తో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.