
పవన్ కల్యాణ్‌కీ, విజయ్‌కీ ఎప్పుడూ ఏదో ఒక పోలిక ఉంటూనే ఉంటుంది. లేటెస్ట్ గా అది పొలిటికల్ కంపేరిజన్ అయింది. ఇద్దరికీ సినిమాల అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయినా షూటింగులకు నో టైమ్ అంటున్నారు. ఫ్యూచర్‌లో రెండు పడవల మీద ప్రయాణం చేస్తారా? లేకుంటే రాజకీయాల మీదే ఫోకస్ చేస్తారా?

ఆరడుగుల బుల్లెట్టు పవన్ కల్యాణ్ ప్రస్తుతానికి రెండు పడవల మీదే ప్రయాణం చేస్తున్నారు. షార్ట్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని సినిమాలు చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ ఉండండి చిటికెలో వచ్చేస్తానంటూ పొలిటికల్ మీటింగులకు హాజరు కావడం... ఇదీ వరస.

ప్రస్తుతానికి సెట్స్ మీదున్న సినిమాల వరకు సరే. ఎలాగోలా పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఏం నిర్ణయించుకుంటారు? సినిమాల్లోకి కొత్తగా వచ్చే డైరక్టర్లే కాదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కెప్టెన్లు కూడా పవర్‌స్టార్ కోసం కథలు రాసుకుని సిద్ధంగానే ఉంటారు. మరి వారి పరిస్థితి ఏంటి? అంటే... ప్రస్తుతానికి ష్.. సైలెన్సే!

మన దగ్గర పవన్ కల్యాణ్‌కి ఎంత మార్కెట్ ఉందో, కోలీవుడ్‌లో విజయ్‌కి అలాంటి మార్కెట్టే ఉంది. ఇద్దరూ రెమ్యునరేషన్ల పరంగానూ అందనంత ఎత్తులో ఉంటారు. అయినా నో ఇష్యూస్.. మేం పే చేస్తాం.. మాకు బిజినెస్ ఎలా చేసుకోవాలో తెలుసు అంటూ వాళ్ల ముందు క్యూలో ఉంటారు నిర్మాతలు. కాల్షీట్లు ఇవ్వండి బాబూ అని ప్రొడ్యూసర్లు అడుగుతున్నా ఎటూ తేల్చలేని పరిస్థితిలో ఉన్నారు పవన్ అండ్ విజయ్

ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నారు కాబట్టే, రీసెంట్‌గా లోకేష్ కనగరాజ్ కూడా ఓ ప్రశ్నకు ఇంటిలిజెంట్‌గా సమాధానం చెప్పారు. విజయ్ కాల్షీట్ ఇస్తే లియో సినిమాకు సీక్వెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని స్టేట్‌మెంట్ ఇచ్చారు లోకేష్. 'వాళ్లు కాల్షీట్లు ఇస్తే'... అనే మాటలు ఇక పవన్, విజయ్ విషయంలో మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంటాయేమో!