
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. అది వ్యక్తిగత జీవితమైనా.. వృత్తిపరమైన జీవితమైనా అంటూ... ఆల్రెడీ పవర్‌స్టార్ చెప్పిన విషయానికి కాసింత పర్సనల్ ఫ్లేవర్ యాడ్ చేసి చెబుతున్నారు సమంత.

ఇంతకీ ఈ లేడీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నట్టు? కెరీర్ మొదలుపెట్టి 14 ఏళ్లయింది. రోజుకు పది పనులు చేసేదాన్ని. ఐదు గంటలే నిద్రపోయేదాన్ని.. శరీరానికిగానీ, మనసుకు గానీ ఎప్పుడూ విశ్రాంతినివ్వలేదు.

సేద దీరడమంటే ఏంటో తెలియదు నాకు అంటూ తాను గడిపిన జీవితాన్ని రివైండ్ చేసి చూసుకుంటున్నారు సమంత. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే... తాను ఫేస్ చేసిన ఇష్యూస్ గురించి తలచుకుంటుంటే, ఇవన్నీ కళ్లముందు మెదులుతున్నాయని చెప్పారు.

చేతిలో ఉన్నది చేజారిపోతుందనే భయం, కెరీర్‌లో అత్యంత గొప్ప స్థాయిలో ఉన్నా, దానికి కారణం తాను కాదేమోననే భయం.. ఇలా రకరకాల భయాలు వెంటాడేవని గుర్తుచేసుకున్నారు. ఒకానొక సందర్భంలో తాను నటించిన సినిమా ప్రమోషన్లకు కూడా హాజరుకాలేకపోయానని బాధపడ్డారు సామ్.

సినిమా చచ్చిపోతుందని నిర్మాత కన్విన్స్ చేస్తే, ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేయగలిగానని చెప్పారు సమంత. యశోద సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సమంతకు మయోసైటిస్ అటాక్ అయింది.

తనకు మయోసైటిస్ అటాక్ అయినప్పుడు రకరకాల వార్తలు వినిపించాయన్నది ఈ బ్యూటీ చెబుతున్న మాట. వాటన్నిటినీ విన్న తర్వాత, తప్పని పరిస్థితుల్లో తన ఆరోగ్యం గురించి అందరితో పంచుకోవాల్సి వచ్చిందని రివీల్ చేశారు సామ్.

పడిపోయామని బాధపడటం కన్నా, కాస్త ఆగి ఆలోచించి, నిలదొక్కుకోవడానికి ప్రయత్నించడంలోనే గెలుపు ఉంటుందని నమ్ముతారు ఈ బ్యూటీ.