
మా సినిమా 100 కోట్ల బిజినెస్ చేసింది.. 150 కోట్లు చేసింది.. 200 కోట్లు చేసిందని చెప్తుంటారు నిర్మాతలు. కానీ అందులో ఒక్కరైనా వచ్చిన కలెక్షన్ల గురించి ఓపెన్‌గా చెప్తారా.. చెప్పరు.

ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా బిజినెస్ చేసి.. లాభాలు తెచ్చిన సినిమాలు రెండు మాత్రమే. ఆ రెండూ రాజమౌళి సినిమాలే.. అవే ట్రిపుల్ ఆర్, బాహుబలి 2. మిగిలిన వాటికి నష్టాలు తప్పలేదు.

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల బిజినెస్ అనేది కల. దాన్ని సాధ్యం చేసిన సినిమా బాహుబలి 2. 2017లోనే 122 కోట్ల బిజినెస్ చేస్తే.. 197 కోట్లు వసూలు చేసింది బాహుబలి 2. కానీ ఆ తర్వాత సాహో 124 కోట్ల బిజినెస్ చేస్తే.. వచ్చింది 80 కోట్ల లోపే. సైరాకు 116 కోట్ల బిజినెస్ జరిగితే.. 103 కోట్ల దగ్గరే ఆగిపోయింది. భారీ స్థాయిలో విడుదలైనా వీటికి నష్టాలు తప్పలేదు.

అల్లు అర్జున్ పుష్ప సైతం తెలుగు రాష్ట్రాల్లో 103 కోట్ల బిజినెస్ చేస్తే.. కరోనాతో పాటు ఏపీలో టికెట్ రేట్ల కారణంగా కేవలం నైజాంలోనే లాభాలు వచ్చాయి. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ 107 కోట్ల బిజినెస్ చేస్తే.. వచ్చింది కేవలం 52 కోట్లు మాత్రమే. ఆచార్య బిజినెస్ 114 కోట్లైతే.. వచ్చింది 40 కోట్లే. మొన్నటికి మొన్న ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల్లోనే 150 కోట్ల బిజినెస్ చేస్తే.. వచ్చింది 90 కోట్లు మాత్రమే.

తాజాగా మరోసారి సలార్‌కు ఈ రికార్డ్ బిజినెస్ జరుగుతుంది. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ నిరాశ పరిచినా.. సలార్‌కు సైతం తెలుగులోనే 200 కోట్ల వరకు ఆఫర్ వస్తుంది. డిసెంబర్ 22న విడుదల కానుంది ఈ చిత్రం. మరి రాజమౌళికి మాత్రమే సాధ్యమైన 100 కోట్ల కలెక్షన్స్‌ను ప్రభాస్ బ్రేక్ చేస్తారా లేదంటే పుష్ప 2 వచ్చేవరకు వేచి చూడాలా అనేది చూడాలిక.