Film News: చిరు చిరకాల ఆశ అదే.. ఎక్కువ స్కోర్ చేయండి అంటూ మైదాన్…
రామ్‌చరణ్, జాన్వీ కపూర్ కలిసి అతిలోక సుందరి రెండో భాగంలో నటిస్తే చూడాలని ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడినని అన్నారు నటుడు తనికెళ్ల భరణి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్... తన తల్లి శోభ కోరిక మేరకు గుడి కట్టించారు. మోహన్‌లాల్ నటించిన 'లూసిఫర్' ఆల్‌టైమ్ కలెక్షన్లను దాటేసింది 'ఆడుజీవితం'. మైదాన్‌లో ఎక్కువ స్కోర్ చేయండి అంటూ ఆఫర్‌ని ప్రకటించింది 'మైదాన్' మూవీ టీమ్.
Updated on: Apr 14, 2024 | 3:26 PM

రామ్‌చరణ్, జాన్వీ కపూర్ కలిసి అతిలోక సుందరి రెండో భాగంలో నటిస్తే చూడాలని ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. అది తన కల అని, నెరవేర్చుకోవడం కోసం చిరకాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. రామ్‌చరణ్, జాన్వీ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఇప్పుడు ఓ సినిమా తెరకెక్కుతోంది.

చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడినని అన్నారు నటుడు తనికెళ్ల భరణి. సరిగా చదువుకోకుండా గోల చేస్తుంటే, తండ్రి చెట్టుకు కట్టేసి కొట్టిన సందర్భాలున్నాయని గుర్తుచేసుకున్నారు. తనకు ఇప్పటికీ డబ్బులు లెక్కపెట్టడం రాదని చెప్పారు తనికెళ్ల భరణి.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్... తన తల్లి శోభ కోరిక మేరకు గుడి కట్టించారు. విజయ్ కట్టించిన సాయిబాబా గుడికి తాను ప్రతి గురువారం వెళ్తానని అన్నారు శోభ. విజయ్ కూడా పలు సందర్భాల్లో అక్కడికి వెళ్లి పూజలు చేస్తుంటారని చెప్పారు శోభ.

మోహన్‌లాల్ నటించిన 'లూసిఫర్' ఆల్‌టైమ్ కలెక్షన్లను దాటేసింది 'ఆడుజీవితం'. పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సినిమా ఇది. ఇప్పటిదాకా మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్5 సినిమాల్లో స్థానాన్ని పదిలం చేసుకుంది. సర్వైవల్ డ్రామాగా తెరకెక్కింది ఆడుజీవితం.

మైదాన్‌లో ఎక్కువ స్కోర్ చేయండి అంటూ ఆఫర్‌ని ప్రకటించింది 'మైదాన్' మూవీ టీమ్. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అని ప్రకటించారు మేకర్స్. అజయ్ దేవ్‌గణ్, ప్రియమణి నటించిన చిత్రం మైదాన్. మౌత్ టాక్ బావున్నా, థియేటర్లలో జనాలు పలచగా ఉండటంతో, ఆఫర్‌ని అనౌన్స్ చేసింది టీమ్.




