
మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని హీరోలకు మాత్రమే ఉంటుందా చెప్పండి..? పైకి చెప్పరు కానీ మాస్ డైరెక్టర్ ట్యాగ్ కోసం దర్శకులు కూడా పోటీ పడుతుంటారు. బొమ్మరిల్లు భాస్కర్ కూడా దీనికేం మినహాయింపు కాదు.. తన పేరు ముందున్న బొమ్మరిల్లు పోయి.. మాస్ భాస్కర్ అనిపించుకోవాలని ట్రై చేస్తున్నారీయన. ఈ క్రమంలోనే తాజాగా మరో అడుగు ముందుకేసారు ఈ దర్శకుడు.

బొమ్మరిల్లు సినిమా వచ్చి 18 ఏళ్లవుతుంది. కానీ ఇప్పటికీ ఆ సినిమా దర్శకుడు భాస్కర్ పేరు ముందు బొమ్మరిల్లు అనే ట్యాగ్ పోలేదు. బొమ్మరిల్లు భాస్కర్ అంటేనే ఈయన్ని గుర్తు పడతారు. దాని తర్వాత పరుగు కూడా క్లాస్ సినిమానే. ఆరెంజ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. ఇలా భాస్కర్ నుంచి వచ్చిన సినిమాల్లో 90 పర్సెంట్ క్లాస్ మూవీసే.

ఆరెంజ్ డిజాస్టర్ తర్వాత తన ఇమేజ్ మార్చుకోవాలని చూసారు బొమ్మరిల్లు భాస్కర్. అందుకే రామ్‌తో ఒంగోల్ గిత్త అంటూ తన స్కూల్ నుంచి బయటికి వచ్చి పక్కా మాస్ సినిమా చేసారు.

కానీ అది కూడా నిరాశ పరచడంతో ఆరేళ్లు సీన్‌లోనే కనిపించలేదు. దాంతో కలిసొచ్చిన క్లాస్ జోనర్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అంటూ అఖిల్‌తో సినిమా చేసి ఓకే అనిపించారు ఈయన.

క్లాస్ జోనర్ కలిసొస్తున్నా.. బొమ్మరిల్లు భాస్కర్ మనసు మాత్రం మాస్ వైపే వెళ్తుంది. తాజాగా సిద్ధూ జొన్నలగడ్డతో జాక్ సినిమా స్పై థ్రిల్లర్ గా రానుంది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా చేస్తున్నారు భాస్కర్. దీంతో తనకు మాస్ డైరెక్టర్‌గా ముద్ర పడిపోతుందని నమ్ముతున్నారీయన. మరోవైపు జాక్‌తో పాటు డిజే టిల్లు 2, తెలుసు కదా సినిమాల్లోనూ నటిస్తున్నారు సిద్ధూ జొన్నలగడ్డ.