ఫామ్ ఈజ్ టెంపరరీ.. క్లాస్ ఈజ్ పర్మినెంట్ అంటూ క్రికెట్‌లో ఓ మాట ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్‌కు ఇది అతికినట్లు సరిపోతుంది. రెండు మూడేళ్లుగా ఫామ్‌లో లేని బ్యాట్స్‌మెన్ అంతా ఒకేసారి సెంచరీలు బాదేసినట్లు.. హిందీ హీరోలందరూ ఈ ఏడాది విరుచుకుపడుతున్నారు. 2023లో టాప్ 3 కాదు.. 4 మూవీస్ వాళ్లవే. మరి ఇదే ఫామ్ కంటిన్యూ అవుతుందా..? బాలీవుడ్‌కు నిజంగానే మంచి రోజులు వచ్చినట్లేనా..?
అవును.. నిజంగానే బాలీవుడ్ సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత.. ఇంకా చెప్పాలంటే చాలా ఏళ్ళ తర్వాత సౌత్ కంటే బెటర్‌గా పర్ఫార్మ్ చేసింది నార్త్ ఇండస్ట్రీ. 2023లో టాప్ 4 మూవీస్ అక్కడ్నుంచే వచ్చాయి. కొన్నేళ్లుగా సౌత్ దెబ్బకు నార్త్ నరాలు కట్ అయిపోయాయి. కానీ ఈ ఏడాది పఠాన్, గదర్ 2, జవాన్.. తాజాగా యానిమల్ లాంటి సినిమాలు మళ్లీ వాళ్లను ట్రాక్ ఎక్కించాయి.
2023 మొదట్లో పఠాన్ ఏకంగా 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ఆ తర్వాత రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, కేరళ స్టోరీ, తూ ఝూటీ మై మక్కర్, ఓ మై గాడ్ 2 లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన గదర్ 2 కేవలం హిందీలోనే 520 కోట్లు వసూలు చేసింది.. జవాన్‌తో ఒకే ఏడాది రెండోసారి 1000 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించారు షారుక్ ఖాన్.
అక్షయ్ కుమార్ మిషన్ రాణిగంజ్ డిజాస్టర్‌గా నిలిచినా.. సల్మాన్ ఖాన్ టైగర్ 3 జస్ట్ యావరేజ్ అనిపించినా.. మొన్నొచ్చిన యానిమల్ మాత్రం రప్ఫాడిస్తుంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే 700 కోట్లు వసూలు చేసింది. మరో 10 రోజుల వరకు సినిమాలేవీ లేవు కాబట్టి కచ్చితంగా 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.
సందీప్ వంగా టేకింగ్‌కు రణ్‌బీర్ కపూర్ నటన తోడై యానిమల్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తుంది. 2023లో రెండు 1000 కోట్ల సినిమాలు.. ఓ 700 కోట్ల ప్రాజెక్ట్.. ఒక 600 కోట్ల సినిమాతో బాలీవుడ్ టాప్ స్పీడ్‌లో ఉంది. డిసెంబర్ 21న షారుక్ ఖాన్ డంకీ విడుదల కానుంది. మొత్తానికి చాలా ఏళ్ళ తర్వాత బాలీవుడ్ మళ్ళీ తన పూర్తి సత్తా చూపించింది.