- Telugu News Photo Gallery Cinema photos Balakrishna says that the sequel to 'Aditya 369' is ready and there is no stopping it once it starts
Balakrishna: మొదలు పెడితే ఆపేది లేదన్న బాలయ్య.. ఫ్యాన్స్ సంబరాలు..
రీరిలీజ్ సినిమాలకు ప్రీ రిలీజ్ వేడుక చేయడం, దానికి స్టార్ హీరో అటెండ్ కావడం అనేది ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా ఆదిత్య 369. ఈ మూవీ రీ రిలీజ్ ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేశారు నందమూరి బాలకృష్ణ. ఆ సినిమా ఎప్పుడూ స్పెషలేనన్నారు. అంతే కాదు... ఈ సినిమా గురించి చాలా విషయాలనే పంచుకున్నారు బాలయ్య.
Updated on: Apr 03, 2025 | 3:25 PM

ఆరోజుల్లోనే భవిష్యత్ తరాల్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా ఆదిత్య 369. అందుకే అది ఇప్పటికీ ఏ తరం వారికైనా సరిపోయే సినిమాలాగా ఉంటుందన్నారు బాలయ్య. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారని, అదేంటో అర్థం చేసుకుని, దానికి తగ్గట్టే తాను సినిమాలు చేస్తానని, అందులో ఆదిత్య 369 చాలా స్పెషల్ అనీ చెప్పారు గాడ్ ఆఫ్ మాసెస్.

తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369. ఈ సినిమా టైమ్‌కే సింగీతం చాలా ప్రయోగాలు చేశారు. ఆయన మీదున్న నమ్మకంతో ఈ సినిమా చేశాను. ఆదిత్య 369కి గుండెకాయ శ్రీకృష్ణదేవరాయలు కేరక్టర్... ప్రేక్షకులు విశేషంగా ఆదరించిన తీరు నాకింకా గుర్తుందన్నారు బాలయ్య.

ఆదిత్య 369 గురించి మాత్రమే మాట్లాడితే సరిపోతుందా? ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ ఒక్క మాట సంగతేంటి? అని ఆడియన్స్ అడిగే ఛాన్స్ ఇవ్వలేదు నందమూరి నటసింహ బాలకృష్ణ.

'ఆదిత్య 369'కి సీక్వెల్ రెడీ అయిందని, మొదలు పెడితే ఆపేది లేదని చెప్పారు బాలకృష్ణ. నిజమైన ఉగాది గిఫ్ట్ ఇదేనంటూ సంబరాలు చేసుకుంటున్నారు బాలయ్య అభిమానులు.

ఏప్రిల్ 4న సినిమాను థియేటర్లలో బంపర్ హిట్ చేసే బాధ్యత మాదేనంటున్నారు. ఆల్రెడీ డాకు మహారాజ్‌తో ఈ ఏడాది సక్సెస్ మీదున్న బాలయ్య.. ఇప్పుడు ఆదిత్య 369తో వేసవిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.





























