
కనిపించిన ఏ ఒక్క రికార్డును కూడా వదిలట్లేదు పుష్ప రాజ్. కనుచూపు మేరలో మరే రికార్డు కనబడకుండా.. అన్నింటినీ తుడిచి పెట్టేస్తున్నాడు.

ఇప్పటికే చాలా రికార్డులు పుష్ప ఖాతాలో చేరిపోయాయి. మరి బాహుబలి 2తో ఉన్న రికార్డుల్ని సైతం పుష్ప రాజ్ లాగేసుకుంటాడా..? ఇప్పటి వరకు ఎంతొచ్చింది..?

ఇంకా ఎంతొస్తే బాహుబలి రికార్డ్ సొంతమవుతుంది..? విడుదలైన 3 వారాల తర్వాత కూడా పుష్ప 2 దూకుడు ఏ మాత్రం తగ్గట్లేదు.

తాజాగా 1700 కోట్ల క్లబ్బులోనూ చేరిపోయింది ఈ చిత్రం. పుష్ప 2కు ముందు ఈ క్లబ్బుల్లో ఉన్న ఏకైక సినిమా బాహుబలి 2. 2017లోనే ఇది చేసి చూపించారు రాజమౌళి.

ఆరేళ్ళ తర్వాత మరో ఇండియన్ సినిమా 1700 కోట్లు వసూలు చేసింది.. అది కూడా కేవలం 21 రోజుల్లోనే..! ఇప్పటికే హిందీలో 740 కోట్లతో ఆల్‌టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప 2.

ఈ దూకుడు చూస్తుంటే 800 కోట్లు కూడా సాధ్యమే అనిపిస్తుంది. బేబీ జాన్ విడుదలైనా కూడా పుష్ప 2పై ఏ మాత్రం ఎఫెక్ట్ పడినట్లు కనిపించట్లేదు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ట్రిపుల్ ఆర్, బాహుబలి 2 తర్వాత 200 కోట్ల షేర్ సాధించిన మూడో సినిమాగా నిలిచింది పుష్ప 2.

బాలీవుడ్‌లో పుష్ప 2 దూకుడు చూస్తుంటే ఏ రికార్డు అసాధ్యమని చెప్పలేం..! న్యూ ఇయర్ కాదు.. సంక్రాంతి వరకు అక్కడ పుష్ప దూకుడు ఖాయం.

ఇదే జరిగితే బాహుబలి 2 పేరు మీదున్న 1800 కోట్ల రికార్డ్ అందుకున్నా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజంగా ఇదంతా జరిగితే.. నిర్మాత మైత్రి రవి చెప్పినట్లు 2000 కోట్ల క్లబ్బులో చేరుతుందేమో..?