Reduce Stress: పని ఒత్తిడితో బాధపడుతున్నారా..? అయితే తక్షణ ఉపశమనం కోసం ఈ 5 చిట్కాలను అనుసరించండి..
ఉద్యోగ జీవితం అనేది మన కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరుకునేందుకు అనేక అవకాశాలను కల్పించే వేదిక. అదే సమయంలో ఉద్యోగానికి బాధ్యతలు మనపై భారాన్ని పెంచుతాయి. ఫలితంగా అలసట, ఆవేశం ముఖ్యంగా ఒత్తిడి వంటివి తలెత్తుతాయి. పని ఒత్తిడి కారణంగా మనం జీవితంలో కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. అందువల్ల పని ఒత్తిడికి దూరంగా ఉండడానికి ఉపకరించే 5 చిట్కాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 28, 2022 | 3:00 PM

విరామం తీసుకోండి: ఉద్యోగ జీవితారంభంలో పని ఒత్తిడి అంతగా అనిపించకపోవచ్చు. కానీ క్రమక్రమంగా మనపై బాధ్యతలు, పని ఒత్తిడి పెరిగిపోతుంటాయి. అందువల్ల మీపై ఒత్తిడి భారాన్ని తగ్గించుకునేందుకు పని సమయంలో విరామం తీసుకోండి. బాల్కనీ వైపుకు వెళ్లి ప్రశాంతంగా కొంచెం తాజా గాలిని తీసుకోవడానికి ప్రయత్నించండి. అలా చేయడం వల్ల మీ శరీరం ఎంతో రిఫ్రెష్‌గా ఉంటుంది. అలా చేయడం వల్ల మన కండరాలు కూడా సడలించి విశ్రాంతి అస్వాదిస్తాయి. తద్వారా మీపై పని ఒత్తిడి తగ్గినట్లవుతుంది.

రోజువారీ షెడ్యూల్: ఉద్యోగ సమయంలో విరామాలను సమర్ధవంతంగా తీసుకునేందుకు రోజువారీ షెడ్యూల్‌ను రూపొందించుకోండి. అలా చేయడం వల్ల షెడ్యూల్ ప్రకారం పని చేసుకోవచ్చు. ఇంకా ఇది మీకు క్రమశిక్షణ అలవరడానికి కూడా ఉపకరిస్తుంది.

సమయానికి భోజనం చేయండి: ఉద్యోగ జీవితంలో రోజులు చాలా బిజీబిజీగా సాగిపోతుంటాయి. ప్రస్తుత కాలంలో ఉద్యోగులు తమ పనిలో మునిగిపోవడం వల్ల భోజనం గురించి మర్చిపోవడం సర్వసాధారణం అయిపోయింది. అలా చేయడం వల్ల కూ డామనపై ఒత్తిడి పెరగడానికి ఒక కారణం. అందువల్ల సమయానికి భోజనం చేయండి. తద్వారా మీ శరీరానికి కావలసిన శక్తి, పోషకాలు అందుతాయి. ఇది మీ ఉద్యోగ జీవితాన్ని సమర్థవంతంగా లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది.

అన్నింటినీ పట్టించుకోకండి: ఉద్యోగ జీవితంలో కొన్ని రకాల అవమానాలను ఎదుర్కోవడం అందరి విషయంలో జరిగేదే. కొందరు కావాలని మన గురించి అభ్యంతరకరమైన రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో అవి గొడవలకు, ఘర్షణలకు కూడా దారితీస్తాయి. వాటి కారణంగా మనపై ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాల గురించి పెద్దగా ఆలోచించకండి. మనకు ఇబ్బంది కలిగించే విషపూరితమైన భావాలతో మనస్సు నిండిపోకుండా ఉండేందుకు అలాంటి అనుభవాలను కాలానికి వదిలేయడం ఉత్తమం.

అనవసరంగా అన్నింటికీ రియాక్ట్ అవ్వకండి: కొన్ని సమయాలలో చిన్న చిన్న విషయాలకు కూడా మనం చాలా కంగారు పడిపోతుంటాం. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే భావనలతో కూడా కలత చెందుతూ ఉంటాం. అలా చేయడం వల్ల మనపై మనమే ఒత్తిడిని పెంచుకున్నట్లవుతుంది. అందువల్ల అలా చేయకుండా.. అన్ని విషయాలకు రియాక్ట్ అవకుండా ఉండడమే శ్రేయస్కరం.




