Digital Gold vs Physical Gold: డిజిటల్ గోల్డ్ vs ఫిజికల్ గోల్డ్.. ఎందులో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయి? ఏది ఎక్కువ సేఫ్..
దీపావళి వేళ బంగారం పెట్టుబడులపై చర్చ జోరుగా సాగుతోంది. ఫిజికల్ బంగారం, డిజిటల్ బంగారం మధ్య ఏది ఉత్తమమని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ ఆర్టికల్ రెండింటి ప్రయోజనాలు, ఖర్చులు, భద్రతను వివరిస్తుంది. తయారీ ఖర్చులు, GST, భద్రతా సమస్యలు ఫిజికల్ గోల్డ్‌లో ఉంటాయి.
Updated on: Oct 15, 2025 | 12:46 PM

సాధారణంగా మన దేశంలో బంగారం అంటే ఒక సెంటిమెంట్. కేవలం అకరించుకోవడానికే కాకుండా.. దాన్ని ఒక స్టేటస్‌లా, భవిష్యత్తులో ఆదుకునే ఆసరాగా భావిస్తుంటారు. అందుకే ఎక్కువగా ఫిజికల్ గోల్డ్‌ని కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్న క్రమంలో.. డిజిటల్ గోల్డ్ కూడా వచ్చింది. అంటే మన దగ్గర బంగారం ఉండదు కానీ, మన డబ్బు బంగారంపై పెట్టుబడి రూపంలో ఉంటుంది. బంగారం ధర పెరిగితే మన పెట్టుబడి కూడా పెరుగుతుంది. దాన్ని డిజిటల్ గోల్డ్ అంటారు.

ఈ మధ్య కాలంలో చాలా మంది డిజిటల్ గోల్డ్‌పై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీపావళి సమీపిస్తున్న క్రమంలో చాలా మంది బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్నారు. అయితే అలంకారం కోసం కాకుండా పెట్టుబడిగా భావించి బంగారం కొనాలనుకుంటున్న వారు ఫిజికల్ గోల్డ్ కొంటే మంచిదా? లేదా డిజిటల్ గోల్డ్ కొంటే మంచిదా? దేనిపై ఎంత రాబడి ఉంటుంది? ఏది సేఫ్ అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆభరణాల మాదిరిగా పెట్టుబడిదారులు డిజిటల్ బంగారం కోసం తయారీ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వారు దానిని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రూ.10 వంటి తక్కువ పెట్టుబడితో కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ బంగారం సురక్షితమైనది. మరోవైపు భౌతిక బంగారానికి దాని స్వంత ఆకర్షణ ఉంది. ప్రజలు దానిని ఆభరణాలుగా ధరించవచ్చు, దాని ధర కూడా కాలక్రమేణా పెరుగుతుంది. కానీ పెట్టుబడి దృక్కోణం నుండి, ఏది మంచి రూపం, భౌతిక బంగారం లేదా డిజిటల్ బంగారం? ఈ దీపావళికి మీరు ఏమి ఎంచుకోవచ్చు? నిపుణుల అభిప్రాయాలను తెలుసుకుందాం.

డిజిటల్ బంగారం కొనడం భౌతిక బంగారం కొనడం లాంటిదే కావచ్చు, కానీ డిజిటల్ బంగారం కొనడం సౌలభ్యాన్ని అందిస్తుంది. డిజిటల్ బంగారం చౌకగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు రూ.10 తో కూడా చిన్నగా ప్రారంభించవచ్చు. కానీ ప్లాట్‌ఫామ్ స్ప్రెడ్‌లు, జిఎస్‌టి ఉంటుంది, మొత్తం ఖర్చు తరచుగా భౌతిక నాణేలను కొనడానికి దగ్గరగా ఉంటుంది. నిజమైన విలువ సౌలభ్యం. పెట్టుబడిదారులకు, గోల్డ్ ఇటిఎఫ్‌లు తెలివైన ప్రత్యామ్నాయాలు ఎందుకంటే అవి సెబీచే నియంత్రించబడతాయి.

ఫిజికల్ గోల్డ్‌పై 3 శాతం GST కాకుండా ఆభరణాలు తయారీ ఛార్జీలు ఉంటాయి. మళ్లీ అమ్మాలంటే తరుగుకూడా పోతుంది. ఒక వేళ ఎక్కువ మొత్తంలో బంగారం కొని లాకర్‌లో దాచుకుంటే వార్షిక లాకర్ ఫీజులు ఉంటాయి. ఇలా ఫిజికల్ గోల్డ్ కొన్న తర్వాత దానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. చోరీకి గురి అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇక డిజిటల్ బంగారంపై ఖర్చులు కూడా ఉంటాయి. 3 శాతం GST, సాధారణంగా 5 సంవత్సరాల తర్వాత 0.3 - 0.4 శాతం వార్షిక రుసుము ఉంటుంది. కానీ, దీనిపై తయారీ ఖర్చులు, తరుగు లాంటివి ఉండవు. చోరీ భయం అసలే ఉండదు. ఎందుకంటే ఇది భౌతికంగా మన ఇంట్లో ఉండదు.




