
శీతాకాలంలో ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే జలుబుతో పోరాడటానికి సహాయపడుతుంది. ఉదయం 2-3 ఖర్జూరాలు తినడం వల్ల అలసట తగ్గి మీ శరీరం చురుగ్గా మారుతుంది ఖర్జూరాలలో ఇనుము కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది చలికాలం బలహీనత, హిమోగ్లోబిన్ లోపాన్ని నివారిస్తుంది. వాటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శీతాకాలంలో సాధారణంగా కనిపించే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

అంతేకాదు ఖర్జూరాలలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే, కాలానుగుణ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అయితే, ఖర్జూరాలను మితంగా తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలు పొందవచ్చు. వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది, కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువును నియంత్రించుకోవాలనుకునే వారు వాటిని అధికంగా తినకూడదు.

బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: బాదం అనేది శరీరానికి తక్షణ శక్తిని అందించదు. కానీ నెమ్మదిగా ఎక్కవ సేపు శక్తిని అందించేందుకు సహాయపడుతుంది. వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి, ఇవి శీతాకాలంలో శరీరాన్ని బలంగా, వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. బాదంలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది, ఇది చల్లని వాతావరణంలో పొడి చర్మాన్ని నివారించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. బాదం పప్పు మెదడు ఆరోగ్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. బాదంను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.

మరి, శీతాకాలంలో తినడానికి ఏది మంచిది?: ఖర్జూరం, బాదం రెండూ ఆరోగ్యకరమైనవి. మీరు బలహీనంగా, జలుబుగా లేదా అలసిపోయినట్లు అనిపిస్తే, ఖర్జూరం మీకు ఉత్తమమైనది. ఎందుకంటే అవి తక్షణ శక్తిని, వెచ్చదనాన్ని అందిస్తాయి. అయితే, మీరు దీర్ఘకాలిక బలం, రోగనిరోధక శక్తి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే బాదం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

మీ ఆహారంలో రెండింటినీ చేర్చుకోవడం మంచిది. రోగనిరోధక శక్తి, బలం కోసం ఉదయం 10-12 నానబెట్టిన బాదంపప్పులను తినడం ఉత్తమం. శక్తి లేదా వెచ్చదనం కోసం రోజంతా 1-2 ఖర్జూరాలను తినండి. ఖర్జూరాలు, బాదంపప్పుల ఈ కలయిక ఈ శీతాకాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.(Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ , నివేదికల ఆధారంగా అందించబడినవి మాత్రమే.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించండి)