ఫిబ్రవరి 1 నుంచి ఓయూ పరిధిలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు.. అయితే, వారి సమ్మతి తప్పనిసరి..!
ఇంతకాలం ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమైన విద్యా బోధన తిరిగి యధాస్థితికి చేరుకోనుంది. ఇందులో భాగంగా తెలంగాణలో విద్యా సంస్థలను తిరిగి ఓపెన్ కానున్నాయి.

OU colleges from February 1 : కరోనా మహమ్మారి కారణంగా మూతపడ్డ తరగతులు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఇంతకాలం ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమైన విద్యా బోధన తిరిగి యధాస్థితికి చేరుకోనుంది. ఇందులో భాగంగా తెలంగాణలో విద్యా సంస్థలను తిరిగి ఓపెన్ కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోని కాలేజీలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అయితే, ఫైనలియర్ విద్యార్థులను మాత్రమే క్యాంపస్‌కు అనుమతి ఇస్తున్నట్లు వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.
ఈ మేరకు వర్సిటీతో పాటు అన్ని గుర్తింపు పొందిన కాలేజీలకు ఓయూ రిజిస్ర్టార్ సీహెచ్ గోపాల్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 50 శాతం మంది విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హాస్టల్స్, మెస్‌లు తెరిచే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రతి కాలేజీ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కాగా, విద్యార్థులు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుందని, తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం కూడా తీసుకురావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇక, ఇంజినీరింగ్ కాలేజీల్లో 3, 4 సంవత్సరాల విద్యార్థులకు మాత్రమే తరగతులు జరుగుతాయని ఓయూ రిజిస్ర్టార్ తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంటరాక్టివ్ తరగతులు, ప్రాక్టికల్స్, సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన తెలిపారు. ప్రస్తుత సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కనిష్ఠ హాజరు తప్పనిసరి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also… ఏపీలో పంచాయతీ ఎన్నికలను ఏ శక్తి అడ్డుకోలేదు.. అసాధారణంగా జరిగే ఏకగ్రీవాలను సహించంః ఎస్ఈసీ నిమ్మగడ్డ