SRILANKA CRISIS: నెక్స్ట్ లెవెల్‌కు చేరిన లంక సంక్షోభం.. పారిపోయిన దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స.. రెండు నౌకల్లో విదేశాలకు జంప్

Rajesh Sharma

Rajesh Sharma | Edited By: Ravi Kiran

Updated on: Jul 09, 2022 | 4:34 PM

లంక సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. తీవ్రస్థాయిలో ప్రజాగ్రహం పెల్లుబుకిని నేపథ్యంలో దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వదిలి పారిపోయారు. దాంతో ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే ఎమర్జెన్సీ కేబినెట్ భేటీ నిర్వహించి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

SRILANKA CRISIS: నెక్స్ట్ లెవెల్‌కు చేరిన లంక సంక్షోభం.. పారిపోయిన దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స.. రెండు నౌకల్లో విదేశాలకు జంప్
Srilanka


SRILANKA CRISIS REACHED NEXT LEVEL GOTABAYA RAJAPAKSA ESAPES: శ్రీలంక సంక్షోభం నెక్స్ట్ లెవెల్‌కి చేరింది. దాంతో దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ వదిలి పారిపోవాల్సిన దుస్థితి తలెత్తింది. జులై 9వ తేదీన యావత్ దేశ ప్రజానీకం దేశ రాజధాని కొలంబో (Colombo)కు చేరుకునేందుకు సిద్దమైన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు ఏవీ పని చేయలేదు. ప్రజలంతా తమతమ ఇళ్ళలోనే వుండాలని ఆదేశిస్తూ పోలీసు చీఫ్ జారీ చేసిన ఆర్డర్లను తానే ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ప్రజలంతా ఇళ్ళకే పరిమితం కావాలన్న ఆదేశాలు మానవహక్కుల ఉల్లంఘనకిందకు వస్తాయంటూ హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు, చివరికి న్యాయవాదుల సంఘాలు పోలీసు చీఫ్‌ను హెచ్చరించాయి. ఈ ఆదేశాలపై న్యాయపోరాటానికి దిగుతామని వారు హెచ్చరించడంతో పోలీసు చీఫ్ వెనక్కి తగ్గారు. ప్రజలంతా తమ ఇళ్ళకే పరిమితం కావాలన్న ఉత్తర్వులను పోలీసు చీఫ్ ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో జులై 9వ తేదీన ప్రతిపక్షాలు కొలంబో సిటీలో తలపెట్టిన భారీ ర్యాలీలో పాల్గొనేందుకు లక్షలాది మంది లంకేయులు బయలుదేరారు. రైల్వే శాఖను డిమాండ్ చేసి ప్రత్యేక రైళ్ళను వేయించుకుని మరీ దేశరాజధానికి లక్షలాది మంది చేరుకున్నారు. జులై 9వ తేదీన ఉదయమే కొలంబోలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ (Presidential Palace) చుట్టూ వేలాది మంది గుమికూడారు. దాంతో జడిసిపోయిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స తన ప్యాలెస్ నుంచి జంప్ అయ్యారు. గొటబయ రాజపక్స పారిపోయినట్లు దేశ రక్షణ శాఖ అధికారులు ధృవీకరించారు. నిజానికి లంకలో ఆర్థిక సంక్షోభంతోపాటు రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ప్రజలు రోడ్డెక్కిన తొలి రోజు నుంచే గొటబయ తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, తన పరిపాలనాబృందం నుంచి పలువురు మంత్రులు, చివరికి తన కుటుంబీకులు కూడా తప్పుకున్నప్పటికీ రాజపక్స మాత్రం పదవిని పట్టుకుని వేలాడుతూనే వున్నాడు. తాజాగా దేశంలో సంక్షోభం మరింతగా ముదరడం, నిత్యావరసర వస్తువులు, పెట్రోలియం ధరలు అమాంతం ఆకాశాన్నంటడంతో ప్రజల్లో ఆగ్రహం రెట్టింపయ్యింది. రాజపక్స దిగిపోతేగానీ దేశానికి పట్టిన దరిద్రం పోదని భావిస్తున్న లంకేయులు వివిధ మార్గాలలో తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.

అందులో భాగంగా జులై 9వ తేదీన దేశ రాజధానికి లక్షలాది మంది చేరుకుని భారీ ర్యాలీ నిర్వహించాలని ప్రతిపక్షాలు, పలు ప్రజా సంఘాలు నిర్ణయించాయి. దీనిని నిలువరించేందుకు పోలీసులు కర్ఫ్యూ ఆదేశాలిచ్చారు. ప్రజలంతా తమతమ ఇళ్ళలోనే వుండాలని పోలీస్ చీఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వేలాది మంది రాజపక్సకు వ్యతిరేక నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు చేతబూనీ రోడ్డెక్కారు. పరిస్థితిని ఏ మాత్రం అదుపు చేయలేని దుస్థితిలో భద్రతాబలగాలుండిపోవాల్సి వస్తుందని సాక్షాత్తు ఏఎఫ్పీ రక్షణ శాఖ ఉన్నతాధికారులు అంగీకరిస్తున్నారు. నెలల తరబడి ఆర్థిక సంక్షోభం కొనసాగడంతో లంకేయుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. జులై 9వ తేదీన కొలంబో ర్యాలీకి పిలుపునివ్వడంతో లక్షలాది మంది రాజధానికి చేరుకున్నారు. కర్ఫ్యూ నిబంధనలను పట్టించుకోకుండా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ చేరుకుని దాని ముందు బైఠాయించారు. వారంతా ఏ క్షణమైనా ప్యాలెస్‌లోకి ప్రవేశించడం ఖాయమని భయపడిపోయిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స జులై 9వ తేదీన ఉదయమే పలాయనం చిత్తగించారు. నిజానికి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ వైపు ఎవరు రాకుండా చూసేందుకు భారీ ఎత్తున భద్రతా బలగాలను రెండు రోజుల ముందే మోహరించారు. కానీ లక్షలాదిగా తరలి వస్తున్న నిరసనకారులను వారు నియంత్రించలేకపోయారు. వేలాది మంది సాయుధ భద్రతా సిబ్బందిని మోహరించినా వారు తుఫానులా విరుచుకుపడిన ఆందోళన కారులను నియంత్రించలేకపోయారు. దాంతో అధ్యక్ష భవనం చుట్టూ ఆందోళనకారులు బైఠాయించారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు తాము చేపట్టిన చర్యలను న్యాయస్థానం కూడా సమర్థించకపోవడంతో లంక పోలీసులు చేతులెత్తేసిన పరిస్థితి. కొన్ని చోట్ల రాజపక్స వర్గీయులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ దాడులలో జులై 8, 9 తేదీలలో కనీసం 9మంది మరణించినట్లు, వందలాది మంది గాయపడినట్లు తెలుస్తోంది. July 9న ఉదయం కొలంబో నగరం రణక్షేత్రంగా మారింది. దేశ అధ్యక్షుడు రాజపక్స అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు దూసుకువచ్చారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీఛార్జీ చేశారు. ఈ ఘటనలో 26 మందికి గాయాలు కాగా, నలుగురు జవాన్లు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఆందోళనకారులు రాజపక్స నివాసాన్ని చుట్టుముట్టడంతో ఆయన వారి నుంచి తప్పించుకుని ఇంటి నుంచి పరారయ్యారు. ఈ మేరకు ఆ దేశ రక్షణ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అధ్యక్షుడు వెంటనే రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడి మీడియా ప్రసారం చేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే కొలంబో పోర్టు నుంచి రెండు నేవల్ షిప్పులు కనిపించడం లేదని, వాటిలోనే గొటబయ రాజపక్స విదేశాలకు పారిపోయారని ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. దాంతో రాజపక్స మారిషస్‌గానీ, మాల్దీవులకుగానీ పారిపోయి వుండవచ్చని భావిస్తున్నారు. రెండు నేవీ నౌకల్లో ఆయన భారీ ఎత్తున డబ్బు, బంగారం తనతో తీసుకువెళ్ళారని అనుమానిస్తున్నారు.  దేశాధ్యక్షుడు పారిపోయిన నేపథ్యంలో ప్రధాని రణిల్ విక్రమసింఘే (Ranil Vikramasinghe) అత్యవసరంగా కేబినెట్ నిర్వహించారు. సముద్ర తీరంలో వున్న ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ చుట్టుముట్టిన లక్షలాది మంది ఆప్రాంతాన్ని తమ నినాదాలతో హోరెత్తించారు. ప్యాలెస్‌లోకి ప్రవేశించి.. బెడ్ రూములు, స్విమ్మిగ్ పూల్లలో విచ్చలవిడిగా తిరిగారు.

గత దశాబ్ధకాలంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభం దిశగా మళ్ళింది. ఆ దేశానికి ఎడాపెడా అప్పులిచ్చిన డ్రాగన్ కంట్రీ చైనా (China) ఇపుడు సంక్షోభసమయంలో ఆదేశాన్ని గాలికివదిలేసింది. గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund)) నుంచి అప్పులు తీసుకున్న లంక అందుకు అంగీకరించిన షరతులను నిలుపుకోలేదు. దాంతో ఐఎంఎఫ్, ఆసియన్ డెవలప్‌మెంటు బ్యాంకు (Asian Development Bank) వంటి తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సంస్థలు లంకను దూరంపెట్టాయి. దాంతో తప్పనిసరైన పరిస్థితిలో ఎక్కువ వడ్డీ రేటుకు అప్పులిచ్చే చైనీస్ బ్యాంకులను లంక ఆశ్రయించింది. అక్కడ ఇరుక్కుపోయింది. శ్రీలంక ఇప్పటి వరకు 51 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు విదేశీ సంస్థలకు రుణం చెల్లించలేక చేతులెత్తేసింది. ఇప్పుడు తమ దేశాన్ని బెయిలవుట్ (Bail-out) చేయాలంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధిని వేడుకుంటోంది. దేశంలో తీవ్రస్థాయిలో ద్రవ్యోల్బణం నెలకొనడానికి గొటబయ అనుసరించిన విధానాలే కారణమని దేశప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. గొటబయ కుటుంబీకుల అవినీతి, విదేశీ రుణాల నుంచి పెద్ద ఎత్తున ఆ కుటుంబం డబ్బు దండుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో తనపై ఆగ్రహాన్ని తగ్గించుకునేందుకు తన కుటుంబీకులను కేబినెట్ పదవుల నుంచి తప్పించినా ఫలితం లేకపోయింది. మాజీ అధ్యక్షుడు, తన సోదరుడు మహేంద రాజపక్సను కూడా ప్రధాని పదవి నుంచి తప్పించారు. ఆ పదవిని పార్లమెంటులో ఒక్క సభ్యుడు కూడా లేని పార్టీకి చెందిన రణిల్ విక్రమసింఘేకు కట్టబెట్టారు. రణిల్ ప్రధాని అయ్యాక పలు దేశాలను సంప్రదించి తమ దేశానికి సాయం అందించేలా ఒప్పించారు. మన దేశం సైతం రణిల్ ప్రధాని కాకముందు నుంచే లంకకు సాయమందిస్తోంది. రణిల్ కోరిక మేరకు సాయాన్ని రెట్టింపు చేసింది. కానీ ఈ చర్యలేవీ లంకలో సంక్షోభాన్ని నివారించలేకపోయాయి. ఇపుడు దేశాధ్యక్షుడు పారిపోయిన నేపథ్యంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఆసక్తిరేపుతోంది.


లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu