Ramayapatnam port: 36 నెలల్లో రామాయపట్నం ఓడరేవు.. ఏపీ, తెలంగాణ వాణిజ్యానికి కీలకంగా మారనున్న పోర్టు

|

Aug 05, 2021 | 7:56 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రామాయపట్నం ఓడరేవు నిర్మాణం 36 నెలల్లో పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల వారికి..

Ramayapatnam port: 36 నెలల్లో రామాయపట్నం ఓడరేవు.. ఏపీ, తెలంగాణ వాణిజ్యానికి కీలకంగా మారనున్న పోర్టు
Ramayapatnam Port
Follow us on

Ramayapatnam port: ఆంధ్రప్రదేశ్‌లోని రామాయపట్నం ఓడరేవు నిర్మాణం 36 నెలల్లో పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల వారికి ఓడరేవు ప్రయోజనాలు అందుతాయి. ఆక్వా, గ్రానైట్‌, పొగాకు ఎగుమతులకు ఈ పోర్టు కీలకంగా మారనుంది. 10 వేల 660 కోట్ల వ్యయంతో 3 వేల 437 ఎకరాల్లో 19 బెర్తులతో రెండు దశల్లో ఓడరేవు నిర్మాణం జరగనుంది. ఓడరేవు నిర్మాణం పర్యావరణ హితంగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఓడరేవుల నిర్మాణం కోసం ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నంలను పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ ఉత్వర్తులు జారీ చేశారు. ఏపీ మేరిటైమ్‌ బోర్డు ఆధ్వర్యంలో పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలుగా పనిచేసేలా ఆదేశాలిచ్చారు. ఒక్కో సంస్థ పెట్టుబడి నిధి కింద 50 వేల షేర్ల జారీకి అనుమతి ఇచ్చారు. పోర్టు అభివృద్ధి సంస్థలో బోర్డు డైరెక్టర్లుగా సీఎస్‌, ఐదుగురు అధికారులు ఉండనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీర ప్రాంతాల్లో అభివృద్ధి ఓడరేవులతోనే సాధ్యమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే ప్రకాశంజిల్లాపై దృష్టి సారించింది. రాష్ట్రంలోనే రెండో భారీ ఓడరేవుగా గతంలో ప్రతిపాదించిన రామాయపట్నాన్ని తిరిగి పరిగణనలోకి తీసుకుంది. ఇక్కడ నౌకాశ్రయ ఏర్పాటు దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల సంస్థ(ఇన్‌క్యాప్‌) ఇప్పటికే రామాయపట్నం నౌకాశ్రయానికి అనుకూలంగా ఉందని నివేదిక ఇచ్చింది.

అందులో భాగంగా గతంలోనే సీయం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో రామాయపట్నంలో పోర్టు నిర్మించేందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు రామాయపట్నం పోర్టుకు అడ్డంకిగా మారిన సమీపంలోని కృష్ణపట్నం పోర్టు పరిధిని కుదిస్తూ కేబినెట్‌లో తీర్మానించారు. దీంతో రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. గత పదేళ్ళుగా రామాయపట్నంలో పోర్టు నిర్మాణం చేయాలని ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు చేసిన ఆందోళనలు ఫలించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.

మరోవైపు రెవెన్యూశాఖ ఇప్పటికే ఓడరేవు నిర్మాణం కోసం గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లోని రామాయపట్నం, చాకిచర్ల, రావూరు రెవెన్యూ గ్రామాల్లోని భూములను ఎంపిక చేసింది. మొత్తంగా 5416.62 ఎకరాలను కేటాయించింది. అందులో ఇప్పటికిప్పుడు ప్రభుత్వ పోరంబోకు భూములు 1850.03 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం దగ్గరే ఓడరేవు నిర్మాణానికి సానుకూలత వ్యక్తం చేసింది. దీంతో ప్రకాశంజిల్లా తీర ప్రాంతం రామాయపట్నం దగ్గర ఓడరేవు నిర్మాణం వల్ల జిల్లాకు మహర్దశ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పది జిల్లాలు సముద్రం తీరం వెంట ఉన్నాయి. కాకినాడ, చెన్నై కోస్తా నడవ, రామాయపట్నం ఓడరేవు నిర్మాణాలకు అనుకూలంగా ఉన్నాయని రైల్వే ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ బృందం కూడా జిల్లాలో పర్యటించి ఇప్పటికే నిగ్గు తేల్చింది. రామాయపట్నంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చైనా, సింగపూర్‌ నుంచి పరిశ్రమలు పెట్టేందుకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో నర్సాపురం, రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి రైట్స్‌ సంస్థ అధికారులు అధ్యయనం చేశారు. గ్రానైట్‌, ఆక్వా ఎగుమతులు, దిగుమతులకు అనుకూల పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

తాజాగా రామాయపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్తులు జారీ చేయడంతో అధికారులు అందుకు తగ్గట్టుగా భూసేకరణ, నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి సిద్దం చేస్తున్నారు. రెండు దశల్లో జరగనున్న పోర్టు నిర్మాణానికి మొదటి దశలో అవసరమైన మేర పనులు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకాశంజిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ టీవీ9కి తెలిపారు. రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణం వల్ల వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశంజిల్లాలో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్న కందుకూరు, కనిగిరి ప్రాంత వాసులకు ఈ పోర్టు నిర్మాణం వల్ల శాశ్వత ఉపాధి లభిస్తుంది.

Read also: TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల డెడ్ లైన్.. రేపటిలోగా జీతాలు ఇవ్వకపోతే ఎల్లుండి నుంచి సమ్మె