CONGRESS PARTY CRISIS INTROSPECTION REQUIRED: ఓవైపు చాన్నాళ్ళ తర్వాత జాతీయ అధ్యక్ష బాధ్యతల కోసం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజస్థాన్ (Rajastan)లో ఏర్పడిన సంక్షోభం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా (Sonia Gandhi)కు తలనొప్పిగా మారింది. ఓరకంగా చెప్పాలంటే గతంలో జరిగినటువంటి తప్పిదాన్నే పునరావృతం చేయడం వల్ల ఈసారి కొత్త సంక్షోభం తలెత్తిందని చెప్పక తప్పదు. వద్దు మొర్రో అంటుంటే నువ్వే బరిలో వుండాలంటూ అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)ని అధ్యక్ష ఎన్నికల బరిలోకి దింపిన సోనియా ఇపుడు తాను తప్పు చేశానేమో అన్న మీమాంసలో పడి వుంటారు. సోనియాకు చెప్పలేక కనీసం రాహుల్ గాంధీ (Rahul Gandhi)నైనా ప్రసన్న చేసుకుందామని కేరళ వెళితే ఆయన గెహ్లాట్ నెత్తిన మరో పిడుగు వేశారు. అధ్యక్ష ఎన్నికల బరిలో వుండాలని ఖరాఖండిగా చెప్పిన రాహుల్.. రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్ (Sachin Pilot)కు ఛాన్స్ ఇవ్వాలని కూడా ఒత్తిడి చేశారు. కొచ్చి (Kochi)లో రాహుల్‌ని కలిసిన తర్వాత గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు అక్షరాలా జైపూర్ (Jaipur) వేదికగా సత్యమయ్యాయి. కాంగ్రెస్ శాసనసభా పక్షం (Congress Legislature Party) భేటీలో ఏం జరుగుతుందో చూడండి అంటూ కొచ్చిలో గెహ్లాట్ కామెంటారు. దాని పరమార్థం ఏంటో సెప్టెంబర్ 25 జైపూర్ జరిగిన పరిణామాల చాటి చెప్పాయి. 108 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుండగా వారిలో ఏకంగా 92 మంది సచిన్ పైలట్‌కు వ్యతిరేకంగా గళమెత్తేలా వ్యూహం పన్నారు.. అక్షరాలా దాన్ని అమలయ్యేలా చూసుకున్నారు అశోక్ గెహ్లాట్. పైకి తన ప్రమేయం లేదంటున్నా రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం (Rajastan Congress Crisis) వెనుక అశోక్ గెహ్లాట్ వ్యూహముందన్నది ఏ మాత్రం రాజకీయ పరిఙ్ఞానం వున్న వారికైనా బోధపడుతుంది. స్పీకర్‌ని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఢిల్లీ నుంచి వెళ్ళిన అజయ్ మాకెన్ (Ajay Maken) లాంటి వారు ఏమీ చేయలేక తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే, జరిగిన పరిణామాల నేపథ్యంలో సోనియాకు గెహ్లాట్ మీద ఆగ్రహం పుట్టిందని కొన్ని పత్రికలు రాశాయి. ఆమె సీరియస్ అవడమే కాక.. అధ్యక్ష బరి నుంచి గెహ్లాట్‌ను తప్పించి.. మరొక వీర విధేయుడిని ఎంపిక చేయాలని కూడా సోనియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో ఇపుడు కర్నాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అధ్యక్ష బరి నుంచి గెహ్లాట్‌ను తప్పించాలన్న నిర్ణయం సోనియా ఆయన మీద ఆగ్రహంతో తీసుకున్నా అది ఆయన నెత్తిన పాలు పోసినట్లే. ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష స్థానం కంటే రాజస్థాన్ సీఎంగా కొనసాగడమే కావాలి. అందుకు ఆయన తగిన వ్యూహాన్ని ఎంచుకున్నారు దాదాపు సక్సెస్సయ్యారు కూడా. 2023లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. తన అధ్వర్యంలోనే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాలని గెహ్లాట్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయని అనుకోవాల్సి వుంది.
అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు జరిగింది అన్న చర్చ కూడా ముఖ్యమే. ఆర్నెల్ల క్రితం జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కాంగ్రెస్ అధిష్టానం గుణపాఠం నేర్చుకోలేదు అనడానికి తాజా చర్యలే నిదర్శనం. పంజాబ్ అసెంబ్లీ (Punjab Assembly Election 2022)కి మరో ఆర్నెల్లలో ఎన్నికలు జరుగుతాయని అనుకుంటున్న తరుణంలో అక్కడ ముఖ్యమంత్రిని మార్చింది కాంగ్రెస్ అధిష్టానం. కెప్టెన్ అమరీందర్ సింగ్ (Captain Amarinder Singh)ను తప్పించింది. దళితుల ఓట్లు రాలతాయని భావించి చరణ్‌జీత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channy)కి సీఎం బాధ్యతలు కట్టబెట్టారు. అంతకు ముందు అమరీందర్ సింగ్ వద్దు మొర్రో అంటున్నా వినకుండా పంజాబ్ పీసీసీ బాధ్యతలను బీజేపీ (BJP) నుంచి వచ్చిన నవ్‌జోత్ సింగ్ సిద్దూ (Navjot Singh Siddu)కు అప్పగించారు. సిద్దూ నియామకంతోనే కినుక వహించిన అమరీందర్ సింగ్‌ను సరిగ్గా ఎన్నికల ముందు సీఎం సీటు నుంచి కూడా తప్పించారు. ఈ ప్రయోగం వికటించడంతో పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. అంతకు ముందు మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోను జ్యోతిరాదిత్య సింధియా (Jyotiradiya Sindia)ను కాదని సీనియర్ పేరిట కమల్‌నాథ్‌కు సీఎం సీటిచ్చారు. కొన్నాళ్ళు ఓపికగా వున్న జ్యోతిరాదిత్య చివరికి బీజేపీ ఆకర్ష్‌కు పడిపోయారు. 28 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన కాషాయ జెండా నీడలో చేరారు. తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. తిరిగి బీజేపీ తరపున గెలిపించుకున్నారు. కేంద్ర మంత్రి పదవిని కొట్టేశారు. ఇలాంటి ఉదంతాలను చూసిన తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా వుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి నాలుగేళ్ళ క్రితం జరిగిన రాజస్థాన్ ఎన్నికల తర్వాత తననే సీఎం చేస్తారని సచిన్ పైలట్ భావించారు. ఆయనకు రాహుల్ గాంధీ అండదండలుండడంతో పైలెటే సీఎం అన్న వార్తలు పెద్దఎత్తున వచ్చాయి. కానీ సోనియా తనదైన శైలిలో సీనియారిటీ పేరిట అశోక్ గెహ్లాట్‌కు అవకాశమిచ్చింది. సీఎం సీటు చేజారడంతో కినుక వహించిన సచిన్ పైలట్ డిప్యూటీ సీఎం పదవితో సంతృప్తి పడాల్సి వచ్చింది. అయితే ఆ సీటులోను సచిన్‌ను సరిగ్గా నెగలనీయకుండా చక్రం తిప్పారు గెహ్లాట్. ఏడాదిన్నర క్రితం తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోయేందుకు సచిన్ ప్రయత్నించారు. కానీ రాహుల్ బుజ్జగింపుతో ఆగిపోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో తనకు సీఎం సీటు కన్‌ఫర్మ్ అని సచిన్ పైలట్ భావించారు. కానీ గెహ్లాట్ రాజకీయ వ్యూహం ముందు పైలట్ తేలిపోయాడు.
కీలకమైన సందర్భాలలో తీసుకున్న రాంగ్ డెసిషన్స్ పార్టీకి చేదు అనుభవాలుగా పరిణమిస్తున్నాయని తెలిసినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మారడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు అసోం (Assom) విషయంలో సోనియా తీసుకున్న నిర్ణయాన్ని ఉటంకిస్తున్నారు. అసోం కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా వున్న హేమంత బిశ్వ శర్మ (Hemanta Biswa Sharma)ను కాదని సీనియర్ అంటూ తరుణ్ గొగోయ్‌కు బాధ్యతలిచ్చారు. దాంతో హేమంత బీజేపీలో చేరిపోయారు. ఇపుడు సీఎం అయ్యారు. సీఎం అవడమే కాకుండా ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ విస్తరించడంలో కీలక భూమిక పోషించారు. రాజస్థాన్‌లోను 2018 ఎన్నికల్లో విజయపథాన నడిపిన పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌ని కాదని పరిపాలనా అనుభవం పేరిట అంతకు ముందు అయిదేళ్ళుగా ఇంటికే పరిమితమైన గెహ్లాట్ సీఎం సీటునిచ్చారు సోనియా గాంధీ. పీసీసీ అధ్యక్షుడిగా వున్న సచిన్ పైలట్‌నే సీఎం చేయాలని రాహుల్ గాంధీ యత్నించినా సోనియా మాటే నెగ్గుబాటైంది. తన రాజకీయ అనుభవాన్ని గెహ్లాట్ పరిపాలనలో ఏ మేరకు చూపించారో పక్కన పెడితే తనకు ఎప్పటికైనా ప్రత్యర్థిగా మారతారన్న భయంతో సచిన్ పైలట్‌ను మాత్రం ఐడియల్‌గా వుండిపోయేలా చేయడంలో మాత్రం సక్సెస్సయ్యారు. ఇపుడు తనకు సీఎం సీటు దక్కకపోతే సచిన్ పైలట్ అయితే బీజేపీ వైపు చూడడమో లేక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్‌గా వుండిపోవడమో చేయవచ్చు. ఇందులో ఏది జరిగినా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మరోవైపు చత్తీస్‌గఢ్ Chattisgadh)లోను అసమ్మతి రగులుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పీసీసీ అధ్యక్షునిగా వున్న భూపేష్ భఘేల్ (Bhupesh Bhaghel)ని సీఎం చేశారు. అయితే రాష్ట్రంలో బలమైన నేతగా ఎదిగిన టీఎస్ సింగ్ దేవ్ (TS Singh Dev) అప్పట్లో సీఎం సీటు కోసం యధాశక్తి ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరి మధ్య అధిష్టానం సయోధ్య కుదిర్చింది. చెరో రెండున్నరేళ్ళు సీఎంగా వుండేలా 2018లో ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం నాలుగేళ్ళు పూర్తి అవుతున్నా భఘేల్ తాను తప్పుకుని సింగ్‌దేవ్‌కు బాధ్యతలు అప్పగించలేదు. దాంతో సింగ్‌దేవ్ అసంతృప్తితో రగిలిపోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. సో.. రాజస్థాన్ సంక్షోభం తెరపడిన తర్వాతైనా.. లేక తెరపడక ముందైనా చత్తీస్‌గఢ్‌లో చిచ్చు రేగడం ఖాయమని తెలుస్తోంది. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. గతంలో బెడిసి కొట్టిన నిర్ణయాలతోనైనా కాంగ్రెస్ అధిష్టానం గుణపాఠం నేర్చుకోలేదనే చెప్పాలి. మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీ వీక్ అవడానికి ఇలాంటి ఎన్నో స్వయంకృతాలే కారణమని భావించాలి.