దేశంలో ఒమిక్రాన్ టెన్షన్.. భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు.. ఎన్నికల వాయిదానే శ్రేయస్కరమా.?

| Edited By: Ravi Kiran

Jan 06, 2022 | 2:05 PM

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి భయంకరంగా ఉంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ అంటుకున్న తీరును...

దేశంలో ఒమిక్రాన్ టెన్షన్.. భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు.. ఎన్నికల వాయిదానే శ్రేయస్కరమా.?
Corona
Follow us on

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి భయంకరంగా ఉంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ అంటుకున్న తీరును వివరించే ఆర్‌ వాల్యూ కూడా అనూహ్యంగా పెరిగింది. ఈ వివరాలు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. నగరాలలో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని కూడా తెలిపింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడం ప్రధాన బాధ్యతగా భావించాలి? అయితే ఇప్పటికే అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆంక్షలు విధించాయి. నైట్‌ కర్ఫ్యూలు అమలు చేశాయి. వీటితో కరోనా కంట్రోల్‌కు వస్తుందన్న నమ్మకం లేదు కానీ.. వ్యాప్తిని మాత్రం కొంచెం నిరోధించవచ్చు. ఇది సరిపోతుందా? ప్రభుత్వాలకు ఇంకే బాధ్యత లేదా? కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంత భయానకంగా ఉన్న సమయంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అవసరమా? ఎన్నికలన్నాక పార్టీలు ఉత్తినే ఊరుకోవు.. ఓట్ల కోసం ర్యాలీలు, సభలు సమావేశాలు పెట్టి తీరతాయి. ప్రపంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న కరోనా మన దేశంలోనూ విజృంభిస్తోంది. జనం ఇప్పుడు పొరపాటు చేస్తారా అని కాచుకుని కూర్చుంది. ఇదే సమయంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కూడా అన్ని రాష్ట్రాలలో ప్రబలుతోంది. స్కూల్స్‌ ఆల్‌రెడీ బందయ్యాయి. కాలేజీలకు సెలవులిచ్చేశారు. థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌లలో రిస్ట్రిక్షన్స్‌ మొదలయ్యాయి. థర్డ్‌వేవ్‌ మొదలయ్యిందని వైద్య నిపుణులు చెప్పేశారు.

మహారాష్ట్ర , ఢిల్లీ కరోనాతో వణికిపోతున్నాయి. తమిళనాడు, గుజరాత్‌లలో వైరస్‌ ప్రమాదఘంటికలను మోగిస్తోంది. ఇలాంటి విపత్కర సమయంలో ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌, గోవా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ రావచ్చని అంటున్నారు. అయితే నోటిఫికేషన్‌ రాకముందే రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు మొదలు పెట్టాయి. ర్యాలీలు తీస్తున్నాయి. ప్రజలు కూడా కించిత్‌ భయం లేకుండా ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటున్నారు. భౌతిక దూరం పాటించడం ఎలాగూ లేదు.. కనీసం మాస్క్‌లైనా పెట్టుకోకపోతే ఎలా? రాజకీయ పార్టీలు, ప్రజలు కోవిడ్‌ నిబంధనలను ఏ మాత్రం పాటించడం లేదు. ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదంతా గమనిస్తోన్న న్యాయస్థానాలు కూడా తప్పుచేస్తున్నారంటూ హెచ్చరించాయి. ఎన్నికలను వాయిదా వేయడమే శ్రేయస్కరమని అలహాబాద్‌ హైకోర్టు సూచించింది కూడా!

మొన్నామధ్య జరిగిన బెంగాల్‌, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను చూశాం కదా! వివిధ రాష్ట్రాలలో అప్పుడే జరిగిన ఉప ఎన్నికలనూ చూశాం. ఆ ఎన్నికల తర్వాత ఏం జరిగిందో కూడా మనకు అనుభవమే! ఎన్నికల ర్యాలీలు, సభలు సమావేశాల కారణంగా కరోనా వైరస్‌ భయంకరంగా వ్యాప్తి చెందింది. నిజమే.. ఎన్నికల వేళ భారీ జన సమీకరణ ఉండి తీరుతుంది.. దాని వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదమూ ఉంది.. అందుకే ఎన్నికలు జరుపుకుంటే జరుపుకోండి కానీ జనం ఒక్క చోట గుమిగూడే ప్రచారాలకు మాత్రం అనుమతి ఇవ్వకండి అని ఎన్నికల సంఘానికి, ప్రధానమంత్రి మోదీకి న్యాయస్థానం సూచించింది.. కాకపోతే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని అంటున్నాయట. ఈ మాట ఎన్నికల సంఘం చెబుతూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్నికలకు సిద్ధమవుతోన్న రాష్ట్రాలకు లేఖలు రాసింది. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవ్వడమే విచారకరం. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో చర్చలు జరపడం వల్ల ఎన్నికల సంఘానికి గ్రౌండ్‌ రియాలిటీ తెలుస్తుందనుకోవడం సరికాదు.. అసలు కరోనా వైరస్‌ ఎంత వేగంగా విస్తరిస్తోంది? ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఏఏ రాష్ట్రాలలో జడలు విప్పుకుంటోంది? అన్నది ఎన్నికల సంఘం నివేదికలు తెప్పించుకోవాలి. ఆ తర్వాతే ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.

బెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరి, అసోమ్‌, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్నికల సంఘం బాధ్యతారహితంగా వ్యవహరించిందని మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనకింకా గుర్తుంది. కరోనా సెకండ్‌వేవ్‌ బీభత్సం సృష్టించడానికి ఎన్నికలే కారణమని హైకోర్టు తెలిపింది. బెంగాల్‌లో అయితే ప్రతి బహిరంగసభకు లక్షలాది మంది జనం హాజరయ్యారు. బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా అక్కడ కరోనా కేసులు సగానికి సగం ఒక్కసారిగా పెరిగాయి. అక్కడి వరకు ఎందుకు? పంజాబ్‌నే తీసుకుంటే.. నిన్న ఒక్క రోజు ప్రచారానికే కరోనా కేసులు 147 శాతం పెరిగాయి.

ఇప్పుడు ఎన్నికలకు సంసిద్ధమవుతున్న రాష్ట్రాలు కరోనా వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టలేదన్నది అక్షర సత్యం. మణిపూర్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో అయితే 40 శాతం ప్రజలకు రెండో విడత టీకా అందలేదు. టీకాల ప్రక్రియను ఎంత వేగవంతం చేసినా ఎన్నికల నాటికి అందరికీ టీకా అందుతుందన్న నమ్మకం లేదు. పైగా పార్టీలు నిర్వహిస్తున్న రాజకీయ సభలను చూస్తున్నాం కదా! ఒక్కరికి మాస్క్‌ ఉండటం లేదు. భౌతిక దూరం సంగతి సరేసరి!

శుభకార్యాలు, అంతక్రియలకు పరిమితులు విధించినప్పుడు ఎన్నికల ర్యాలీలకు ఎందుకు ఉండకూడదన్నదే ప్రశ్న. సినిమా థియేటర్లలో 50 శాతం అక్యూపెన్సీ ఉన్నప్పుడు సభలకు ఎందుకు ఉండకూడదు? బెంగాల్‌ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా భారీ బహిరంగ సభలు, పాదయాత్రలు ఉండకూడదని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం గట్టిగా చెప్పేసింది. ఎందుకంటే వాటి వల్ల కరోనా ఎంత వేగంగా విస్తరిస్తుందో తెలుసు కాబట్టి. ఇప్పుడు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తప్పని సరి అని రాజకీయపార్టీలు భావిస్తే మాత్రం కోవిడ్‌ నిబంధనలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అదే సమయంలో సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలి. ఎన్నికలు ఎప్పుడైనా జరుపుకోవచ్చు. ఆ వెసులుబాటు ఉండనే ఉంది. ప్రాణాలు మాత్రం పోతే మళ్లీ రావు.. ఇది రాజకీయ నాయకులు గుర్తుంచుకుంటే మంచిది.