AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జవాబుదారీ కావాల్సిందే, అంతర్జాతీయ వ్యవస్థలను చైనా విచ్చలవిడిగా దుర్వినియోగం చేసింది: అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి

డ్రాగన్‌ కంట్రీ ఎప్పటికీ డేంజరస్ అని అమెరికా కొత్త ప్రభుత్వం కూడా అంటోంది. చైనా అంతర్జాతీయ వ్యవస్థలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిందని అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తాజాగా

జవాబుదారీ కావాల్సిందే, అంతర్జాతీయ వ్యవస్థలను చైనా విచ్చలవిడిగా దుర్వినియోగం చేసింది:  అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి
Venkata Narayana
|

Updated on: Feb 08, 2021 | 1:33 AM

Share

డ్రాగన్‌ కంట్రీ ఎప్పటికీ డేంజరస్ అని అమెరికా కొత్త ప్రభుత్వం కూడా అంటోంది. చైనా అంతర్జాతీయ వ్యవస్థలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిందని అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తాజాగా ఆరోపించారు. దీనికి డ్రాగన్ జవాబుదారీ కావాల్సిందేనని స్పష్టం చేశారు. చైనా విదేశాంగ మంత్రి యాంగ్ జీచీతో మాట్లాడిన ఆయన షిన్‌జియాంగ్, టిబెట్, హాంకాంగ్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రస్తావించారు. అన్ని ప్రాంతాల్లో మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలకు బాసటగా నిలుస్తామని బ్లింకెన్ స్పష్టం చేశారు. మయన్మార్‌లో సైనిక తిరుగుబాటును ఖండించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి రావాలని కోరారు. ఉమ్మడి విలువలను పరిరక్షించడానికి మిత్రపక్షాలు, భాగస్వామ్య దేశాలతో కలిసి అమెరికా పని చేస్తుందని యాంగ్‌కి స్పష్టం చేశారు.

భారత్‌-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతకు భంగం కలిగించేందుకు, అంతర్జాతీయ వ్యవస్థను ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన చైనాను జవాబుదారుగా చేస్తామన్నారు. టిబెట్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, షిన్‌జియాంగ్‌లో మైనారిటీలను మూకుమ్మడిగా నిర్బంధిస్తున్న వార్తల నేపథ్యంలో చైనాపై పశ్చిమ దేశాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. హాంకాంగ్‌లో నిరసనల అణచివేత, దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనంటూ పొరుగు దేశాల హక్కులు చైనా కాలరాస్తోందన్న విమర్శలు ఉన్నాయి. గత నెల 20న జో బైడెన్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే జరిగిన మొదటి సమావేశంలోనే బ్లింకెన్ చైనాపై ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, బ్లింకెన్ అమెరికా విదేశాంగ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు కూడా భారత్ తో చైనా వ్యవహరిస్తోన్న తీరుపట్ల విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. భారత, అమెరికా దేశాలకు ఓ ఉమ్మడి సవాల్ ఉందని, అదే చైనా దేశమని ఆయన అప్పట్లో అన్నారు. భారత వాస్తవాధీన రేఖ వద్ద ఆక్రమణతో సహా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న చైనా దూకుడును అడ్డుకోవలసి ఉందని ఆయన చెప్పారు. ఇందుకు ఇండియా. అమెరికా పూనుకోవలసి ఉందని పేర్కొన్నారు. లడాఖ్ లోని నియంత్రణ రేఖ వద్ద భారత, చైనా దేశాలమధ్య ఉద్రిక్తతతల నేపథ్యంలో అప్పట్లో బ్లింకెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు, తమ దేశాధ్యక్షునిగా జో బైడెన్ పదవిని స్వీకరించిన అనంతరం భారత దేశంతో సన్నిహిత సంబంధాల కోసం కృషి చేస్తారని, రెండు దేశాల మధ్య ప్రజాస్వామిక బంధాలను మరింత బలోపేతం చేస్తారని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకోసం భావసారూప్యం గల భాగస్వాములతో జరుపుతున్న కృషిలో ఇండియా పాత్ర ప్రశంసనీయమన్నారు బ్లింకెన్. ఆగస్టు 15 న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బైడెన్ ప్రచార వర్గం ఇండో-అమెరికన్లతో నిర్వహించిన కార్యక్రమంలో ఆంటోనీ పై విధంగా మాట్లాడారు.

ఉత్తరాఖండ్‌ విలయం: తపోవన్ టన్నెల్ దగ్గర ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృతి, సహాయక చర్యలు నిలిపివేత