AGNIPATH SCHEME: అగ్నిపథ్ స్కీమ్‌పై అదే రచ్చ.. అగ్రదేశాల్లో అమల్లో వున్న విధానం మనకెందుకు సరికాదు.. ఓ పరిశీలన

|

Jun 20, 2022 | 8:52 PM

అగ్నిపథ్ వంటి స్వల్పకాలిక ఆర్మీ రిక్రూట్ మెంట్ పథకాలు ప్రపంచంలో ఇదే మొదటి సారి కాదు. యంగ్ బ్లడ్‌ని రక్షణ రంగంలోకి తేవాలన్న ఉద్దేశంతో చాలా దేశాలు ఈ రకమైన రిక్రూట్ ‌మెంటు విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు అమెరికానే...

AGNIPATH SCHEME: అగ్నిపథ్ స్కీమ్‌పై అదే రచ్చ.. అగ్రదేశాల్లో అమల్లో వున్న విధానం మనకెందుకు సరికాదు.. ఓ పరిశీలన
Army, Navy, Airforce Emblems And Agitations
Follow us on

AGNIPATH ARMY RECRUITMENT POLICY ROCKING ENTIRE INDIA: ఆర్మీ రిక్రూట్ మెంట్ విధానంలో సమూల మార్పులను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ (AGNIPATH ARMY RECRUITMENT SCHEME) దేశంలో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే వుంది. ఈ కొత్త విధానం అర్థం కాక చెలరేగిపోయిన యువత ఇపుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన, ఇస్తున్న క్లారిటీతో కాస్త వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. దానికి తోడు కేంద్ర రక్షణ శాఖ మిలిటరీ వ్యవహారాల అదనపు కార్యదర్శి అనిల్ పూరీ(ANIL PURI) జూన్ 19 ఆదివారం చేసిన ప్రకటన ఆర్మీలో చేరాలనుకునే యువకుల్లో కొత్త ఆలోచనకు తెరలేపినట్లు కనిపిస్తోంది. ప్రపంచంలోని చాలా శక్తివంతమైన మిలిటరీ వ్యవస్థలున్న దేశాలు ఆమెరికా (AMERICA), ఇజ్రాయెల్ (ISRAEL), చైనా (CHINA), రష్యా (RUSSIA), జర్మనీ (GERMANY) వంటివి ఈ కొత్త విధానం వంటి స్కీమ్ ద్వారానే ఆయా దేశాల ఆర్మీ రిక్రూట్ మెంట్లు జరుపుకుంటున్నాయి. ఈ కొత్త విధానం అమలుపై తగ్గేదేలే.. అంటూ అనిల్ పూరీ కుండ బద్దలు కొట్టారు. కేంద్రం నుంచి వెనక్కి తగ్గేదేలేదన్న సంకేతం రావడం.. దానికి తోడు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి ఆందోళన కార్యకలాపాలలో పాల్గొంటే భవిష్యత్తులో ఆర్మీ సహా ఏ ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగాలను అనర్హులవుతారన్న హెచ్చరిక కూడా బాగానే పని చేసినట్లు తెలుస్తోంది. అయితే.. అగ్నిపథ్ మంచిదా కాదా ఈ అంశంపై మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. కొందరు దీన్ని శక్తివంతమైన రక్షణ వ్యవస్థ దిశగా చేపట్టిన సరికొత్త సంస్కరణతో పోలుస్తుంటే.. మరికొందరు సైన్యాన్ని బలహీన పరిచే చర్యగా అభివర్ణిస్తున్నారు. జూన్ 15వ తేదీన కేంద్రం ఈ అగ్నిపథ్ పథకం పూర్వాపరాలను వెల్లడించింది. ఆరోజు సాయంత్రం నుంచే మీడియా ఈ స్కీమ్‌కు సంబంధించిన వివరాలపై కథనాలను ప్రసారం చేసింది. మర్నాడు దినపత్రికల్లో కూడా ఈ అంశం పతాక శీర్షికల్లో వచ్చింది. అయితే.. కనీసం 24 గంటలు గడవక ముందే ఉత్తరాది రాష్ట్రాలలో యువత కేంద్రప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా మరీ ముఖ్యంగా రైల్వేస్టేషన్లే టార్గెట్‌గా ఆందోళన చేపట్టింది. బీహార్ (BIHAR), యుపీ (UP), హర్యానా (HARYANA), జార్ఖండ్ (JHARKHAND) రాష్ట్రాలలో ఆర్మీలో చేరాలనుకుంటున్న యువత ఉద్యమానికి దిగింది. జూన్ 16వ తేదీన ఈ ఉద్యమం మొదలైంది.

నిజానికి ఇక్కడే ఓ సందేహం.. ‘‘జూన్ 16 ఉదయం పత్రికల్లో అగ్నిపథ్ స్కీమ్ వివరాలు ప్రచురించారు. కానీ గంటల వ్యవధిలోనే యువత రైల్వేస్టేషన్లకు చేరుకుంది. కాస్త లోతుగా ఆలోచిస్తే ఇదంతా ప్లాన్డ్‌గానే జరిగి వుంటుందన్న సందేహం కలుగక మానదు.’’ మర్నాడు అంటే జూన్ 17 ఉదయం ఎనిమిదిన్నరకు సికింద్రాబాద్ (SECUNDERABAD) రైల్వేస్టేషన్లో విధ్వంస కాండ మొదలైంది. వరంగల్ (WARANGAL), ఖమ్మం (KHAMMAM), కరీంనగర్ (KARIMNAGAR) జిల్లాల నుంచి వచ్చిన యువకులు స్టేషన్‌లో హింసకు పాల్పడ్డారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. స్టేషన్‌లోని ప్రైవేటు దుకాణాల్లో విధ్వంసం సృష్టించారు. రైళ్ళకు నిప్పు పెట్టారు. ఇందుకోసం ఏకంగా పెట్రోల్ బాటిళ్ళను తెచ్చుకున్నారంటే ఎంత పక్కాగా ప్లాన్‌తో దుండగులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఆర్మీలో చేరాలన్న సంకల్పం వున్న వారిలో ఎంతో కొంత క్రమశిక్షణ, దేశం మీద భక్తిభావం.. ప్రభుత్వ ఆస్తుల రక్షణ బాధ్యత.. వంటివి సహజంగానే వుంటాయి. కానీ సికింద్రాబాద్ సహా చాలా రైల్వేస్టేషన్లలో ఆస్తుల విధ్వంసం, రైల్వే బోగీల దహనానికి పాల్పడ్డవారిలో ఆర్మీలో చేరే లక్షణాలు మచ్చుకైనా కనిపించలేదు. ఇలాంటి యువకులు ఇండియన్ ఆర్మీకి అవసరమా అంటే విచక్షణ కలిగిన వారెవరైనా అవసరం లేదనే చెబుతారు. అయితే.. దీన్ని ఆ యువకుల్లో నిబద్దత లేదు అనడానికి సాకుగా కూడా చూపలేము. అందుకంటే శారీరక దృఢత్వం కలిగి.. శారీరక పరీక్షల్లో నెగ్గే ఇలాంటి వారు రాత పరీక్షను పాసయ్యేందుకు కోచింగ్ సెంటర్లపైనే ఆధారపడతారు. ఆ కోచింగ్ సెంటర్లలో బోధకులు చెప్పే దానినే వందశాతం నిజాలుగా భావిస్తారు. అలా గుడ్డిగా నమ్మే వారి నైజాన్నే డిఫెన్స్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తమ వ్యాపార నష్టాలను నివారించుకునేందుకు వాడుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త విధానంలో రిక్రూట్‌మెంటు జరిగితే తమకు తొలినాళ్ళలో నష్టాలు తప్పవన్న ఉద్దేశంతో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు యువతకు రెచ్చగొట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడికి కుట్ర చేసింది డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులేనని తాజాగా జరుగుతున్న పోలీసు దర్యాప్తులో తేలుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రకరకాల పేర్లతో వాట్సప్ గ్రూపులను క్రియేట్ చేయడం.. వాటి ద్వారా అగ్నిపథ్ స్కీమ్‌పై అపోహలను యువతలో వ్యాపింపజేయడం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. సుబ్బారావు వంటి డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులను విచారించడమే ఇందుకు నిదర్శనం.అగ్నిపథ్ వంటి స్వల్పకాలిక ఆర్మీ రిక్రూట్ మెంట్ పథకాలు ప్రపంచంలో ఇదే మొదటి సారి కాదు. యంగ్ బ్లడ్‌ని రక్షణ రంగంలోకి తేవాలన్న ఉద్దేశంతో చాలా దేశాలు ఈ రకమైన రిక్రూట్ ‌మెంటు విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు అమెరికానే తీసుకుంటే ఆ దేశంలో సాయుధ దళాలకు అవసరమైనప్పుడు ఎంపిక చేసుకునేందుకు వీలుగా 18 నుంచి 25 ఏళ్ళ మధ్య వయస్సున్న యువకులంతా తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి వుంటుంది. వీరి నుంచి ఎంపిక చేసుకునే వారికి సైన్యంలో నాలుగేళ్ళు పని చేసే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత వీరిలో శక్తిసామర్థ్యాలున్న వారు సైన్యంలో కొనసాగవచ్చు. అలా ఎంపికైన వారు 20 ఏళ్ళ పాటు సైన్యంలో కొనసాగవచ్చు. నాలుగేళ్ళ తర్వాత సైన్యం నుంచి వెళ్ళి పోయే వారికి 35 వేల క్విక్ షిప్ బోనస్ ఇస్తుంది అమెరికన్ గవర్నమెంటు. ఇపుడు అగ్నిపథ్ ద్వారా ఎంపికయ్యే వారికి నాలుగేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత దాదాపు 12 లక్షల రూపాయలు లభిస్తాయి. అదేసమయంలో వివిధ పారామిలిటరీ దళాల్లోను, పలు ప్రైవేటు సంస్థల్లోను 10 శాతం రిజర్వేషన్‌తో వీరికి ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా వున్నాయి. వీరిలో 25 శాతం మంది శక్తిసామర్థ్యాలున్న వారు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుల్లో కొనసాగుతారు. ఇక చైనా విషయానికి వస్తే ఆ దేశ పదాతిదళంలో ఏకంగా 21 లక్షల 80 వేల మంది వున్నారు. డ్రాగన్ కంట్రీలో 18 ఏళ్ళు నిండిన వారు కనీసం మూడేళ్ళు తప్పనిసరిగా సైన్యంలో పని చేయాల్సి వుంటుంది. ఇది నిర్బంధంగా అమలు చేస్తారు. కానీ ఎవరైతే స్వచ్ఛందంగా ఆర్మీలో చేరతారో వారికి 8ఏళ్ళ సర్వీసు పీరియడ్ అమలు చేస్తారు. ఇజ్రాయెల్ దేశంలోను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకునే విధానం అమల్లో వుంది. ఆ దేశంలో 18 ఏళ్ళు నిండిన వారంతా సైన్యంలో చేరాల్సిందే. వీరిలో యువకులు 32 నెలలు, యువతులు 24 నెలలు సైన్యంలో పని చేయాల్సివుంటుంది. మరోవైపు రష్యాలో అయితే ఏకంగా నాలుగు రకాల విధానాలు అమల్లో వున్నాయి. నిర్బంధ, కాంట్రాక్టు, ప్రత్యామ్నాయ, ప్రభుత్వ పౌర సేవ వంటి నాలుగు విధానాలు రష్యాలో అమల్లో వున్నాయి. నిర్బంధ విధానంలో రష్యన్ యువకులు ప్రతీ ఏటా రెండు విడతలుగా సైన్యంలో పని చేయాల్సి వుంటుంది. ఏప్రిల్ 1 నుంచి జులై 15వ తేదీ వరకు తిరిగి అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వారు ఆర్మీలో సేవలందించాలి. 18 నుంచి 27 ఏళ్ళ వయస్సు మధ్య కనీసం 12 నెలల సర్వీసును వారు ఆర్మీ సేవలో పూర్తి చేయాల్సి వుంటుంది. 2020 మార్చి (ప్రీ కరోనా పీరియడ్) నాటికి రష్యాలో 2 లక్షల 25 వేల మంది నిర్బంధ సైనికులు, 4 లక్షల 5 వేల మంది కాంట్రాక్టు సైనికులు వున్నట్లు గణాంకాలున్నాయి. ఇక జర్మనీ ఇటీవలనే నిర్బంధంగా సైన్యంలో పని చేయించుకునే విధానాన్ని రద్దు చేసింది. కానీ యువత స్వచ్ఛందంగా ఆర్మీలో పని చేసేందుకు ముందుకొస్తే వారికి 23 నెలల ప్రాథమిక సర్వీసు అవకాశం కల్పిస్తున్నారు.

ఈ అయిదు దేశాల సైన్యాలు ప్రపంచంలో బలమైన మిలిటరీ వ్యవస్థలుగా కొనసాగుతున్నాయి. ఇలాంటి విధానాలను మొత్తమ్మీద 22 దేశాలు అమలు చేస్తున్నాయి. మనదేశంలో 1999 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంటు విధానంలో మార్పులపై చర్చ జరుగుతోంది. 2004 నుంచి 2014 మధ్య యుపీఏ కాలంలోను ఈ తరహా ముసాయిదాలు రూపొందించారు. తాజాగా 2019 నుంచి వివిధ రక్షణ రంగ నిపుణుల సమాలోచనల ఫలితంగానే అగ్నిపథ్ స్కీమ్ రూపొందించారు. మూడేళ్ళ అధ్యయనం, చర్చల ఫలితమే నేటి అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్ మెంటు విధానం. మనదేశ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఈ నాలుగేళ్ళ సర్వీసులో చేరే వారికి జీతభత్యాలు కల్పించారు. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 23 ఏళ్ళ మధ్య వయస్కులు అగ్నిపథ్ ద్వారా త్రివిధ దళాలలో చేరవచ్చు. వారు నాలుగేళ్ళ సర్వీసు పూర్తి చేసుకుని బయటికి వచ్చే రోజున 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం లభిస్తుంది. దాంతో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. అదేసమయంలో కేంద్ర పారామిలిటరీ విభాగాల్లో ఉద్యోగ నియమాలకు వారు వస్తే వారికి ఎన్సీసీ మాదిరిగా 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అయితే.. పెన్షన్ రాదన్న ఉద్దేశంతో చాలా మంది యువత ఈ పథకాన్ని తిరస్కరిస్తోంది. కొత్త విధానాలను అంత తేలికగా ఆమోదించని దేశంలో ఇలా ఆగమేఘాల మీద పథకాలను ప్రవేశ పెట్టి.. వ్యతిరేకతని ఎదుర్కోవడం కంటే.. ముందుగానే ఈ కొత్త విధానంపై చర్చ జరిపి ఆ తర్వాత అమల్లోకి తెస్తే బావుంటుందన్న అభిప్రాయం ఇపుడు వినిపిస్తోంది.