D Mart: వ్యాపారం చేయాలంటే అనుభవం కచ్చితంగా ఉండాలి. తాను ఎన్నుకున్న వ్యాపారంలో లోటు పాట్లు తెలిసి ఉండాలి. ఎడారిలో రగ్గులు..సౌదీలో సెలూన్లు నడిపేద్దామనుకుంటే బోర్లా పడటం ఖాయం. ఎక్కడ.. ఎప్పుడు.. ఎలాంటి వ్యాపారం చేస్తే సొమ్ము చేసుకోవచ్చనేది తెలిస్తేనే వ్యాపారంలో విజయం సాధించగలం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రెండు రోజులుగా డీ మార్ట్ అధినేత రాధాకిషన్ వెయ్యికోట్ల భవంతి కొనుగోలు చేశారనే వార్త చుట్టూ ఎన్నో కథలు వెలువడుతున్నాయి. మామూలు వ్యక్తి కోట్లకు పడగలెత్తడం పై అందరూ చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంలో రాధాకిషన్ దమనీ ని భారత దేశంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా చేసిన వ్యాపారం పై అందరికీ ఆసక్తి కలగడం సహజం. అందుకే ఇప్పుడు ఆయన వ్యాపార సామ్రాజ్యంలో అతి ముఖ్యమైన డి మార్ట్ రిటైల్ చెయిన్ విజయరహస్యం పై స్పెషల్ ఫోకస్.
డీ మార్ట్.. ఈ పేరు తెలీని మధ్యతరగతి ప్రజలు మన దేశంలో ఎవరూ ఉండరు అని చెప్పడం అతిశయోక్తి కాదు. మన దేశంలో ఇంటికి కావలసిన కిరాణా సామాను కోసం వీధి చివరి దుకాణంలో కొనుక్కుని పట్టుకెళ్ళడమే తెలుసు. ఎప్పటికప్పుడు కావలసిన సామాను పదికీ.. పరకకీ అప్పటికప్పుడు కొనుక్కోవడం అలవాటు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో కిరాణా రిటైల్ చైన్ వ్యాపారం మొదలు పెట్టాలంటే చాలా ప్లానింగ్ కావాలి. సరిగ్గా అలాంటి ప్రణాళికతోనే డీ మార్ట్ ప్రారంభించారు రాధాకిషన్.
ముంబయిలోని పొవాయి ప్రాంతంలో 2000 సంవత్సరంలో ఒక చిన్న స్టోర్ ప్రారంభించారు. తరువాత అది దేశవ్యాప్తంగా 214 స్టోర్ ల స్థాయికి ఎదిగింది. అదే 2000 సంవత్సరంలో డీ మార్ట్ తో పాటు ఎన్నో సంస్థలు రిటైల్ వ్యాపార రంగంలోకి వచ్చాయి. వాటిలో చాలా వరకూ సామాను సర్దేశాయి. కానీ డీ మార్ట్ అంచెలంచెలుగా ఎదుగుతూనే వచ్చింది. దీనికి ప్రధాన కారణం మిగిలిన రిటైల్ చైన్ లు అన్నీ స్థానికంగా ఉన్న ఎదో ఒక పెద్ద దుకాణాన్ని తమ బ్రాండ్ తో కలిపేసుకోవడం. ఇది ఇటు ప్రజల్లోనూ.. అటు వ్యాపారాల్లోనూ ఒకరకమైన వ్యతిరేకతను పెంచింది. డీ మార్ట్ మాత్రం ఎక్కడ స్టోర్ ప్రారంభించినా సొంత దుకాణమే తెరిచింది.
డీ మార్ట్ దుకాణాలు కనీసం ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా చూసుకున్నారు. దీంతో స్టోర్ లు విశాలంగా కనిపించడం.. అక్కడ అన్నిరకాల వస్తువులు దొరకడం ప్రజల్లో ఆదరణ పెరిగేలా చేసింది. డీ మార్ట్ మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ వ్యాపారం చేస్తూ వస్తోంది. ఎక్కడా లేని డిస్కౌంట్ లు డీ మార్ట్ లో దొరికేలా చేశారు. దీంతో సాధారణంగానే మధ్యతరగతి ప్రజలు డీ మార్ట్ వైపు చూసేలా పరిస్థితి వచ్చింది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. సాధారణంగా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో దొరికే వస్తువులను కచ్చితంగా రెండిటినీ కొనాల్సి వస్తుంది. దాదాపుగా అన్ని స్టోర్ ల లోనూ ఇదే పధ్ధతి ఉంటుంది. కానీ, డీ మార్ట్ మాత్రం ఒక్క వస్తువు ఆ ఆఫర్ లో తీసుకుంటే దానికి మాత్రమే బిల్ వేస్తుంది. ఇటువంటి చిన్న చిన్న స్ట్రాటజీలు డీ మార్ట్ ను ప్రజలకు చేరువ చేశాయి.
డీ మార్ట్ లో దాదాపుగా దొరకని వస్తువు ఉండదు. ఒక కుటుంబానికి కావలసిన కిరాణా సామాన్ల దగ్గర నుంచి పిల్లల కోసం డుకునే బొమ్మలు.. చెప్పులు.. దుస్తులు.. బ్యాగ్ లు ఇలా అన్నిరకాల సామాను ఒకే దగ్గర దొరుకుతుంది. దీంతో షాపింగ్ కూడా సులభతరంగా ఉడటమూ డీ మార్ట్ కు ఆదరణ దక్కడానికి ఓ కారణం.
రాధాకిషన్ వ్యాపార దృక్ఫధమే డీ మార్ట్ విజయాలకు మూలమని చెప్పొచ్చు. ప్రజల మధ్యలో ప్రజల ఆశలకు అనుగుణంగా చేసే ఏ వ్యాపారమైనా కాసులు కురిపిస్తుంది అని చెప్పడానికి డీ మార్ట్ ఒక ఉదాహరణ.
డీ మార్ట్ ఇప్పుడు మహారాష్ట్ర తో పాటు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్నాటక, గుజరాత్, మధ్య ప్రదేశ్, తమిళ నాడు, పంజాబ్, రాజస్థాన్ లలో డీ మార్ట్ స్టోర్లు విస్తరించి ఉన్నాయి.
2020 ఆర్ధిక సంవత్సరం చివరికి డీ మార్ట్ మార్కెట్ లెక్కలు ఇలా ఉన్నాయి..(ఆధారం వీకీ పీడియా)
రెవెన్యు: 24,930 కోట్లు
మొత్తం ఆదాయం: 1,813 కోట్లు
నికర ఆదాయం: 1,300 కోట్లు
మొత్తం సంస్థ ఆస్తులు: 12,076 కోట్లు
మొత్తం ఉద్యోగులు : 9,456 మంది
కాంటాక్ట్ ఉద్యోగులు : 38,952 మంది
Vakeel Saab Pre Release: వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవన్ డైనమిక్ ఎంట్రీ